Blinkit 10 minute delivery: కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తాజా ఆదేశాలతో దేశంలోని క్విక్ కామర్స్ కంపెనీలు తమ డెలివరీ రూల్స్ మార్చేస్తున్నాయి. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న ’10 నిమిషాల డెలివరీ’ విధానానికి అడ్డుకట్ట పడనుంది. దీంతో చాలా కాలంగా డెలివరీ ఏజెంట్ల పోరాటం విజయవంతం అయ్యిందని చెప్పుకోవచ్చు.
గిగ్ వర్కర్ల భద్రతే ముఖ్యం:
ఇటీవల క్విక్ కామర్స్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల్లోపు వస్తువులను చేరవేయాలనే రూల్ డెలివరీ భాగస్వాములపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కార్మికుల భద్రతను పక్కన పెట్టకూడదని, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ఇటువంటి డెడ్-లైన్లను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.
also read GreenTech : గ్రీన్‌టెక్‌కు ‘గ్రీన్’ సిగ్నల్.. రూ.30 కోట్లతో పవన సేవలకు పదును!
స్పందించిన బ్లింకిట్, జొమాటో:
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జొమాటో, స్విగ్గి ఇన్ స్టామార్ట్ వంటి కంపెనీలు తమ డెలివరీ విధానాలను మార్చుకుంటున్నాయి. 10 నిమిషాల లోపు డెలివరీ చేయాలనే కఠినమైన రూల్స్ ను పక్కన పెట్టి, ఇకపై ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డెలివరీ సమయాన్ని నిర్ణయించనున్నాయి. దీనివల్ల డెలివరీ బాయ్స్ ఎటువంటి ఒత్తిడి లేకుండా సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. అలాగే డెలివరీలు ఏ కారణం వల్లనైనా ఆలస్యమైతే పార్టనర్లపై ఎటువంటి పెనాల్టీలు ఉండబోవని కంపెనీలు హామీ ఇచ్చాయి.
సామాజిక భద్రత:
కేవలం డెలివరీ సమయమే కాకుండా.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది డెలివరీ బాయ్స్ ను e-Shram పోర్టల్‌లో నమోదు చేయాలని, తద్వారా వారికి ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కంపెనీలను ఆదేశించారు. దీనివల్ల ప్రమాద సమయంలో వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు.
కొనుగోలుదారుల్లో మార్పు రావాలి..
సాధారణంగా వినియోగదారులు తమ ఆర్డర్ నిమిషాల్లో రావాలని కోరుకుంటారు. అయితే ఈ వేగం వెనుక ఉన్న రిస్క్ ను వారు గమనించాలని ప్రభుత్వం కోరుతోంది. సేఫ్టీ ఫస్ట్ – స్పీడ్ నెక్స్ట్ అనే నినాదంతో సాగుతున్న ఈ మార్పు వల్ల.. ఆర్డర్ చేరుకోవడానికి మరో 5 నుండి 10 నిమిషాలు అదనంగా పట్టినప్పటికీ అది ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించినట్లవుతుందని నిపుణులు అంటున్నారు. మెుత్తానికి తాజా నిర్ణయంతో గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న లక్షలాధిమంది సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు

