Mumbai Civic Polls: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జనవరి 15న ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా షాపింగ్ మాల్స్‌లో ఇచ్చే భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను తలదన్నేలా అభ్యర్థులు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. చీరలు, సిల్వర్ బౌల్స్, మిక్సర్లు లాంటి వస్తువులతో పాటు కవర్లలో పెట్టి క్యాష్ కూడా పంపిణీ చేస్తున్నారని వెల్లడైంది.
ముంబైలోని ధారావి, సియోన్, చెంబూర్, బోరివిలి వంటి కీలక ప్రాంతాలతో పాటు నవీ ముంబై, థానే పరిసరాల్లో కానుకల పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అధికార పార్టీ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓటుకు నోటు స్కామ్‌కు పాల్పడుతోందని శివసేన నేత సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మిక్సర్లు పంచుతున్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ చెప్పారు. దీనికి తోడు ప్రధాన పార్టీల అనుచరుల మధ్య గొడవలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.
also read Kollam sports trainees: కేరళలో కలకలం.. ఒకే గదిలో ఉరి వేసుకున్న ఇద్దరు క్రీడాకారిణులు..
రంగంలోకి ఎన్నికల కమిషన్..
డబ్బు పంపిణీ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాగ్మారే స్పందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నిఘా టీమ్స్ ద్వారా తనిఖీలను ముమ్మరం చేశామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈస్ట్ నలసపారాలో ఒక టూ వీలర్ డ్రైవర్ నుండి రూ.10 లక్షల క్యాష్ సీజ్ చేయడం, నవీ ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఈ అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది.
ఎన్నికల బరిలో 1,700 మంది..
మొత్తం 227 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార కూటమి, విపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 1,700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. 1.03 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 25 వేల మందికి పైగా పోలీసులతో ముంబై నగరం అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా.. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు కురిపిస్తున్న ఈ కానుకల వర్షంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

