– కనీసం ఊపిరి తీసుకోలేని దుస్థితిలో ఉన్నాం
– తరచూ అనారోగ్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం
– అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
– సర్వసభ సమావేశంలో బొంతపల్లి ప్రజాప్రతినిధుల ఆందోళన
– గ్రామంలో కాలుష్య కొలత యంత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్
– కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక
జిన్నారం, ( తెలుగు ప్రభ ):గ్రామంలోని పరిశ్రమల నుంచి విపరీతంగా విషవాయువులు, కాలుష్యం వెలువడుతుండటంతో కనీసం ఊపిరి తీసుకోలేని దుస్థితి నెలకొందని, గ్రామంలో నివసించలేకపోతున్నామని బొంతపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో, చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొంతపల్లి పరిధిలోని పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా పొగలు, రసాయన విషవాయువులు విడుదల చేస్తున్నారని తెలిపారు. వాటి కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని, కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వాపోయారు. విషవాయువుల ప్రభావంతో చిన్నారులు, వృద్ధులు సహా గ్రామ ప్రజలు తరచూ శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిపారు.
కాలుష్య సమస్యపై గతంలో పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసిన… క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కాలుష్య కొలత యంత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామంలో పర్యటించి కాలుష్య తీవ్రతను పరిశీలించి, ప్రజలను కాలుష్య కోరల నుంచి కాపాడాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘిస్తూ విషవాయువులు విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుని, గ్రామంలో కాలుష్యాన్ని వెంటనే కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే గ్రామ ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

