BRS bandh: నేడు గజ్వేల్ నియోజకవర్గంలో బంద్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ పిలుపునిచ్చిన గజ్వేల్ బంద్ ఉదయం నుంచే కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.
భారీగా మోహరించిన పోలీసులు: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపునివ్వడంతో గజ్వేల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టణవ్యాప్తంగా భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Also read-CM Revanth Reddy: ‘స్పోర్ట్స్ హబ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న.. మా లక్ష్యం అదే!’
దాడికి నిరసనగా ఆందోళన: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నిందితులను వెంటనే గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

