Telangana politics: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో మరో సంచలన మార్పు చోటుచేసుకోబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన ముద్ర వేసిన టీ. జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరగనుంది. ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.
నేడు జగిత్యాలలో కీలక భేటీ: నేడు మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి కీలక నేతలు పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీ ద్వారా పార్టీలో ఆయనకు కల్పించబోయే ప్రాధాన్యతపై స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌తో భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ భేటీ ఫలితంపై ఇప్పుడు ఇరు పార్టీల శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also read-Tamil Nadu: తమిళనాడు సీఎస్‌గా తెలంగాణ బిడ్డ.. ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం!
మారుతున్న రాజకీయ సమీకరణాలు: దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించిన జీవన్ రెడ్డి ఒకవేళ గులాబీ కండువా కప్పుకుంటే.. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, కేడర్ మద్దతు బీఆర్ఎస్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఈ పరిణామంతో జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

