Ujjwala scheme: ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ పథకం కింద అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదికి కేవలం 4 సిలిండర్లను మాత్రమే సబ్సిడీ ధరకు సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఉన్న కోటాను భారీగా తగ్గిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.
నిరంతర కోత.. 12 నుంచి 4కి తగ్గింపు: పేద సంక్షేమం కోసం ప్రారంభించిన ఈ పథకంలో సిలిండర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రారంభంలో ఏడాదికి 12 సిలిండర్ల వరకు రాయితీతో అందించేవారు. అయితే గతేడాది ఈ కోటాను 9 సిలిండర్లకు కుదించారు. తాజాగా ఆ సంఖ్యను మరింత తగ్గిస్తూ కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేశారు. ఈ మేరకు ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లు మాత్రమే సబ్సిడీ ధరకు అందుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అధికారికంగా ధృవీకరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

