IPL-2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది.
ధోని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదే కావడంతో.. లెజెండరీ క్రికెటర్ ఎం.ఎస్. ధోని ఆడతాడా లేదా అనే అంశంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన ధోని.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. “నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడాలనుకుంటున్నాను” అని గతంలో ధోని చెప్పిన వీడియోను అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Also read-DC vs RR: అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై ఘన విజయం
ప్లే ఆఫ్స్ రేసుపై ప్రభావం చూపనున్న మ్యాచ్ ఫలితం: ఈ మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్స్ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైతే.. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్తాయి. అయితే సొంతగడ్డపై చెన్నైని ఎస్‌ఆర్‌హెచ్ ఓడించడం అంత సులువు కాదు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. సొంతగడ్డపై చెన్నై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుందా.. లేక హైదరాబాద్ విజయం సాధించి ముందంజ వేస్తుందా అన్నది నేడు తేలనుంది.

