దిల్లీ(తెలుగు ప్రభ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వివాదంపై సుప్రీంకోర్టును కలవాలనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్పించిన అపాయింట్మెంట్ విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు. ఈ పరిణామంతో దిల్లీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
న్యాయపరమైన నిబంధనలే కారణం..
సీజేఐని కలిసి వినతిపత్రం సమర్పిద్దామన్న ‘ఇండియా’ కూటమి అగ్రనేతల ప్రయత్నానికి సుప్రీంకోర్టు కార్యాలయం బ్రేక్ వేసింది. ఈ అంశాలు ఇప్పటికే న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున, ఇలాంటి ప్రత్యేక వ్యక్తిగత భేటీలు సాధ్యంకావని సీజేఐ స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీజేఐ నిర్ణయం నేపథ్యంలో విపక్షాలు తలపెట్టిన సుప్రీంకోర్టు మార్చ్ మరియు ఆందోళనల కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓట్ చోరీని అరికట్టాలని డిమాండ్ ..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, ‘ఓట్ల చోరీ’ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విపక్షాలు తీవ్ర పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో పాటు ప్రజా సమస్యలపై దేశ ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను కలసి మెమోరాండం సమర్పించాలని రాహుల్ గాంధీ సహా ‘ఇండియా’ కూటమి నేతలు భావించారు. అయితే ఈ అపాయింట్మెంట్ను తోసిపుచ్చుతూ సీజేఐ కార్యాలయం లిఖితపూర్వక సమాధానం పంపింది. కోర్టు పరిధిలో విచారణలో ఉన్న విషయాలపై రాజకీయ పక్షాలతో ఇలాంటి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం తగదని, న్యాయపరమైన మార్గాల ద్వారానే ముందుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఈ పరిణామంతో సోమవారం నాడు దిల్లీలో విపక్షాలు తలపెట్టిన ఆందోళనలు, శాంతియుత మార్చ్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

