One Case – One Data: భారత న్యాయ వ్యవస్థలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల కేసుల డేటాను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో ‘వన్ కేస్- వన్ డేటా'(One Case- One Data) విధానాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రారంభించారు. దీంతో పాటు కక్షిదారులకు, న్యాయవాదులకు సహాయకారిగా ఉండేలా ‘సు-సహాయ్'(Su-Sahay) అనే ఏఐ (AI) ఛాట్‌బాట్‌ను సైతం ఆవిష్కరించారు.
కోర్టుల మధ్య సమాచార వారధి: దేశంలోని తాలూకా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు ఉన్న అన్ని స్థాయిల న్యాయస్థానాలను అనుసంధానించడమే ‘వన్ కేస్- వన్ డేటా’ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. కింది కోర్టు నుంచి పై కోర్టుకు కేసు వెళ్లినప్పుడు.. ఆ కేసు పూర్వాపరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తులు తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. ఈ నూతన ప్రాజెక్టుతో కేసు ప్రస్తుత స్థితిని వెరిఫై చేయడం ఇప్పుడు మరింత వేగవంతం కానుందని సీజేఐ తెలిపారు. భారత న్యాయ చరిత్రలో ఇలాంటి సమగ్ర డేటా ఇంటిగ్రేషన్ జరగడం ఇదే తొలిసారి అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా కొనియాడారు.
Also Read-Mamata Banerjee: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారు.. టీఎంసీ నేతల సంచలన ఆరోపణలు..!
న్యాయ సేవల్లో ఏఐ వినియోగం: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సహకారంతో రూపొందించిన సు-సహాయ్ ఏఐ ఛాట్‌బాట్ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. కోర్టు సేవలను ఎలా పొందాలి.. నిబంధనలు ఏమిటి? వంటి అంశాలపై కక్షిదారులు, న్యాయవాదులకు ఇది దిశానిర్దేశం చేస్తుంది. సామాన్య ప్రజలకు సైతం న్యాయ ప్రక్రియను అర్థం చేసుకునేలా ఈ ఏఐ ఛాట్‌బాట్ సహాయపడుతోందని అన్నారు.

