CJP Delhi Protest Against CEC : ముంబయి నడిబొడ్డున శివాజీ పార్కు సాక్షిగా ఎగిసిపడిన యువజన ఆగ్రహజ్వాలలు ఇప్పుడు హస్తిన పీఠాన్ని తాకనున్నాయా? ప్రజాస్వామ్య వ్యవస్థల పారదర్శకత ప్రశ్నార్థకమవుతోందంటూ ఓ సరికొత్త ప్రజా ఉద్యమం ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరుగుతోంది.
ముంబయి నిరసన విజయవంతమైన నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో దేశం నలుమూలల నుంచి తరలివచ్చి జంతర్ మంతర్ వద్ద భారీ పాదయాత్ర, శాంతియుత ధర్నా చేపడతామని అల్టిమేటం జారీ చేశారు.
సీజేపీ ప్రధాన డిమాండ్లు: సీఈసీ రాజీనామా, న్యాయ విచారణ: ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పేరిట లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ఆరోపిస్తూ, సీఈసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రస్తుత సవరణలను తక్షణమే నిలిపివేసి, 2025 నాటి ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలి.
2023 చట్టం రద్దు: ఈసీ నియామకాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తావిచ్చే 2023 నాటి వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసి, ప్రజా పర్యవేక్షణతో కూడిన పారదర్శక వ్యవస్థను తీసుకురావాలి. దిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే ఆ రోడ్డే తమకు జంతర్ మంతర్ అవుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘గాంధీ మార్గం’లోనే పోరాటం సాగిస్తామని దీప్కే స్పష్టం చేశారు.

