హైదరాబాద్(తెలుగుప్రభ): ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శాసనసభలో చర్చించేందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు సవాల్ చేశారు. ‘ఈ వేదికగా కెసీఆర్ కు సవాల్ విసురుతున్నా.. రండి శాసన సభలో చర్చిద్దాం.. రైతులకు మేం చేసిన మేలు ఏంటో.. మీరు చేసిన అన్యాయం ఏంటో చర్చిద్దాం రండి’అని ముఖ్యంత్రి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తూర్పారబట్టారు. ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులకు కూడా సీఎం చురకలంటించారు. సభలో సీఎం ప్రసంగం యథాతథంగా.. ‘ఆనాడు లక్ష రూపాయల రుణ మాఫీ అన్నారు.. నాలుగు విడతలు.. అసలు ఇస్తాం.. మిత్తీ ఇస్తాం అన్నారు. రెండుసార్లు సీఎం అయినా అరలక్ష కూడా రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మా ప్రభుత్వంలో ఏడాదిలోనే రూ. 21వేల కోట్లు, 25లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2లక్షల వరకు రుణ మాఫీ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 21 వేల కోట్లు ఖర్చు చేసి రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. తెలంగాణలో రుణం లేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా? 32 నెలల్లో పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. రూ. 35వేల కోట్లు రైతుల ఉచిత కరెంటు కోసం ఖర్చు చేశాం. ఆనాడు వ్యవసాయం దండుగ అన్నారు. ఈరోజు పండుగ చేసి చూపించాం. ఇది మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కాదా? రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వంలో ఉంది. రెండున్నరేళ్లలో రూ. 1 లక్ష 70 వేల కోట్లు రైతులకోసం ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నానని’రేవంత్ రెడ్డి అన్నారు.
ఇది కాగితం కాదు.. ఆకలి తీర్చే ఆత్మగౌరవం ..
‘రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదు.. ఇది మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ ఇక్కడి నుంచిగెలిచి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దారు.. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన. ఉచిత బియ్యం, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ల గురించి, ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సన్న బియ్యం గురించి ఒకరు.. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొకరు ఆరోగ్యశ్రీ గురించి మరొకరు మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ రెండూ వేర్వేరు కాదు.. అవి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా.. ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని కలలోనైనా మీరు ఆలోచించారా? మీరిచ్చిన దొడ్డు బియ్యం పశువులకో, కోళ్ల దానాకో, ఇథనాల్ తయారీకో రూపాయకో, అర్థకో అమ్ముకునే పరిస్థితి. పదేళ్లు దొడ్డు బియ్యం వండి పిల్లలకు పెట్టారా అని అడుగుతున్న. 3.48కోట్లమందికి ప్రతినెలా 2.16 లక్ష్లల క్వింటాళ్ల బియ్యాన్ని ఇస్తున్న మాట వాస్తవం కాదా. 17వేల పైచిలుకు రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తున్నాం. మేమిస్తున్న బియ్యం బర్రెలకో, కోళ్లకో వేస్తున్నారా? నేడు ఓపెన్ మార్కెట్ లో కూడా సన్నబియ్యం ధరలు తగ్గడానికి ఇదే కారణం. సన్నబియ్యం ప్రతీ పేద ఇంటికి చేరుస్తున్న ఘనత మా ప్రభుత్వానిది.’ అని సీఎం చెప్పారు.
మేమొస్తే కరెంటు ఉండదన్నారు ..
‘కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఆనాడు మాట్లాడారు.. ఈ 32 నెలల్లో ఏ ఒక్క క్షణమైనా కరెంటు పోయిందా? ప్రతీ పల్లెలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నది నిజం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడారు. ఆయన మాత్రం పక్కనే మెదక్ జిల్లాలో వందల ఎకరాల్లో వరి పండించుకొని క్వింటాల్ కు రూ. 4,200చొప్పున కంపెనీలకు అమ్ముకున్నారు. మేము వరిని కొనడమే కాకుండా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్న వాస్తవం మీ కళ్ల ముందున్నది. ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేదు. వడ్లను కొని సన్న బియ్యం ఇస్తున్నాం. రైతు బంధు బంద్ అన్నారు.. మేము ఎకరాకు రూ. 12000 చొప్పున రైతు భరోసా ఇస్తున్నాం. ఇప్పటివరకు రూ. 36వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. రైతు బంధు గతంలో రూ. 10000 ఉంటే.. రైతు భరోసా 2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నాం. రూ. 36 వేల కోట్లు రైతు భరోసా పథకం ద్వారా 70లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం.’ అని వివరించారు.
ఈసారి చిలకపచ్చ చీరలిస్తాం ..
‘మహిళల కోసం చీరలు ఇచ్చాం. మీరు(బీఆర్ఎస్) బతుకమ్మ చీరలు ఇస్తే ఎవరన్నా కట్టుకున్నరా..? అడవి పందులను బెదిరించడానికో, పిట్లలను బెదిరించడానికో వాడారు తప్ప ఎన్నడన్న కట్టుకున్నారా. మీ బదుకు చెడ. బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లు తిని ఫామ్ హౌస్ లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారు. క్రితం సారి కోటి మందికి చీరలు ఇచ్చాం. ఈసారి డిసెంబర్ లో చిలకపచ్చ చీర పంపిస్తా. 60వేల కోట్లు జీరో వడ్డీతో రూ. 2000కోట్లు మిత్తీ కింద చెల్లించాం. మహిళలు నేడు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, సోలార్ విద్యత్ ఉత్పత్తి చేస్తున్నారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రూ. 11000కోట్లు ఉచిత ప్రయాణానికి చెల్లించాం. మహిళలను 1000బస్సులకు యజమానులను చేసింది నిజం కాదా. 25లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఇచ్చాం. స్కూళ్ల నిర్వహణ బాధ్యత ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు 7లక్షలు కూడా మహిళల పేరునే ఇస్తున్నం.’ అని చెప్పారు.
మీకు ఇళ్లురాలే.. వారికి మాత్రం ఫామ్ హౌస్ లు..
‘డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు ఏ ఒక్కరికైనా ఇచ్చారా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయనకు మాత్రం 1000ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. కొడుకికి 100ఎకరాలు, బిడ్డకి 50ఎకరాలు, అల్లుడికి 25ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయి. మన పేదలకు మాత్రం రాలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏటా 2లక్షల ఇళ్ల చొప్పున పదేళ్లలో 20లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉండే. ఏరోజూ ఆయనకు సోకుల మీదనే తప్ప పేదలకు మేలు చేయాలనే సోయి లేదు. పెద్ద గడీలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్నాడు.. కానీ మీకు ఇవ్వలే. కానీ మీ తమ్ముడిగా నేను రెండేళ్లల్లో 7 లక్షల ఇండ్లు మంజూరు చేశా. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఉండదు. అందుకే నేను ఆనాడు సవాల్ విసిరా.. ఏ ఊళ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారో అక్కడ ఓట్లు అడుక్కొండి, ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లు కడితే అక్కడ మేము ఓట్లు తీసుకుంటాం. నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ చేశా. అర్హులైన అందరికీ శాచురేషన్ మోడ్ లో పెన్షన్లు ఇస్తాం. ఎన్ని లక్షల మంది ఉన్నా పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. ఈరోజే రెండు లక్షల మందికి మంజూరు చేశాం. ఒంటరి మహిళలందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది. వితంతువులు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తాం. అర్హులందరూ దరఖాస్తు చేసుకోండి.. పెన్షన్లు అందించే బాధ్యత మాది. ఐదేళ్లు మహిళకు మంత్రి పదవి ఇవ్వని వాళ్లు.. వాళ్లకి ఒక్కటే మందు. రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగ కాల్చి వాతలు పెడితే ఇట్లాంటి మాటలు తక్కువ మాట్లాడుతారు.’ అని అన్నారు.
మీకు ఉద్యోగాలు రాలే.. వారందరికీ పదవులు..
‘ఆనాడు ఉద్యమమే ఉద్యోగాల కోసం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వాళ్ల ఇంట్లో మాత్రం అందరికీ పదవులొచ్చాయి.. (కేసీఆర్ ను ఉద్దేశించి). మనకి నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు. మేము మొదటి సంవత్సరంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పటివరకు 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో పది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం వయసు రిలాక్షేషన్ కూడా ఇచ్చాం. నిరుద్యోగ యువకులు మాయ మాటలు చెప్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. అగ్గిపెట్టె రావు రూ. 100పెట్టి పెట్రోల్ తెచ్చాడు.. కానీ 10పైసల అగ్గిపెట్ట మర్చిపోయారు. 1200మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు గింత గాయమైనా అయిందా? పిల్లలను రెచ్చగొట్టి.. వాళ్ల శవాలను పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని పెట్టుబడులు పెడుతున్నరు. మీమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. వాళ్ల మాయలో పడొద్దు, వాళ్లు మాయగాళ్లు. మాయ లేడీ లాంటి వాళ్లు. మన ప్రాణాలను అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. అన్ని ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పగించారు. 8.11లక్షల అప్పులతో మాకు అధికారం ఇచ్చారు. ఏటా రూ. 75వేల కోట్లు మిత్తీలు మేము కడుతున్నాం. మూడున్నర లక్షల కోట్లు వాళ్ల అప్పులకు మిత్తీలు కట్టాం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడుపుతున్నాం.’ అని వివరించారు.
ప్రజలపై చేతబడులు చేస్తున్నారు..
‘ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. మాటిస్తే మట్టిలో కలిసే వరకు నిలబడే నాయకత్వం కాంగ్రెస్ ది. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. దుర్మార్గులు రాజకీయం కోసం.. అధికారం కోసం కుట్రలు చేస్తున్నారు. వారి మాయలో పడకండి.. పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. మీ హక్కులను కాదనం.. అవకాశాలను తొలగించం.. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ ముందుకు వెళుతున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై చేతబడులు చేస్తారా? నిజాలు చెబితే మా మహేష్ గౌడ్ కు నోటీసులు ఇస్తున్నారు. అడుగు పెడితే సోషల్ మీడియాలో పెట్టే వాళ్లు తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారు? వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం మనపై ఉంది. వాళ్లమీద కాదు.. ఆయన మామీదే చేతబడి చేసిండని బామ్మర్తి ప్రెస్ వాళ్లకు చెబుతున్నాడు. మేము మంచి చేస్తున్నాం.. కాబట్టే ఎల్నినో కరువులోనూ ఎల్లంపల్లి నిండింది. దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుతున్నా. పదేళ్ల బీఆర్ఎస్, 12సంవత్సరాల బీజేపీ పాలనతో మా రెండేళ్ల పాలనను పోల్చి చూడండి.’అని ప్రజలను కోరారు.
రాహుల్ రాముడైతే జగ్గన్న హనుమంతుడు ..
జగ్గారెడ్డి ఎక్కడ నిలబడాలనో రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు. ఇంత మంచోడు రూ. 1000కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. కుటుంబాన్ని కూడా వదులుకొని ప్రజలకోసం తిరిగే నెంబర్ =1 నాయకుడు జగ్గారెడ్డి. నేనన్నా కుటుంబంతోపాటు రాజకీయం చేస్తా.. కానీ జగ్గన్న మాత్రం ప్రజలకోసమే పనిచేస్తారు. కర్నాటకలో ముందు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. రాహుల్ గాంధీ ఏదైనా చేయవచ్చు. ఎన్నికల్లో ఓడినా… కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారు. తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేడు..అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి.. ఆయనకు మీరు అండగా ఉండాలి. అని సీఎం అన్నారు.

