హైదరాబాద్(తెలుగుప్రభ) : తెలంగాణ బహుజన వీరుడు, సమసమాజ స్థాపన కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో మరాఠీలకు ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో బహుజనులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అలాంటివారని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ట్యాంక్‌బండ్ – నెక్లెస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన పాపన్న కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది బహుజనుల తెలంగాణ అని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, జీవించే స్వేచ్ఛ ప్రజాపాలనలో ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌడ సోదరులు, బీసీ నాయకులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెక్లస్ రోడ్డును పరిశీలించి జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలతోపాటు పాపన్న విగ్రహానికి సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటక కార్యాలయాన్ని తొలగించి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు విగ్రహం కనిపించేలా ఏర్పాటు చేశామని, ప్రత్యేక లైటింగ్‌తో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమరవీరుల స్థూపానికి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో.. సర్వాయి పాపన్న విగ్రహానికి కూడా అంతే ఉంటుందని స్పష్టం చేశారు.
గోల్కొండపై బహుజన జెండా
సర్వాయి పాపన్న కేవలం తన కులం, కుటుంబం కోసం మాత్రమే పోరాడలేదని సీఎం అన్నారు. బహుజనులను ఏకం చేసి దండయాత్రలు నిర్వహించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన వీరుడని కొనియాడారు. వందల ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారంటే ఆయన పోరాటం గొప్పతనం అర్థమవుతుందన్నారు. పాపన్న చరిత్రకు సంబంధించిన ఆధారాలు బ్రిటిష్ లైబ్రరీలోనూ ఉన్నాయని తెలిపారు. పాపన్న విగ్రహాన్ని సంరక్షించే బాధ్యత గౌడ సోదరులపై ఉందన్నారు. పాలమూరు ప్రాంతంలో పండుగ సాయన్న పోరాటం, పౌరుషం అందరికీ తెలుసని పేర్కొంటూ.. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో బహుజన వీరుల పాత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గీత కార్మికులకు అండగా..
గీత కార్మికుల సంప్రదాయ వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని సీఎం హామీ ఇచ్చారు. అర్హులైన నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు అందించేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ భూములు, కాలువ గట్లపై ఈత, తాటి చెట్లను పెద్దఎత్తున నాటాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తూ గీత కార్మికులు మృతిచెందితే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు. కులవృత్తులను గౌరవిస్తూనే పిల్లలకు ఉన్నత విద్య అందించాలని పిలుపునిచ్చారు. ‘మన పిల్లల తలరాతలు మార్చాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి’ అని అన్నారు. గౌడ కుటుంబాల పిల్లలు వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని, ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం అందిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్‌ది కుటుంబ న్యాయం.. మాది సామాజిక న్యాయం
‘కేసీఆర్‌ది కుటుంబ న్యాయం.. నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం.. మాది బహుజనుల న్యాయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో మహేష్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు దక్కాయని తెలిపారు. ఉద్యమకారులకు తమ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ మనుమరాలు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించామని, కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా, అనిల్‌కుమార్ యాదవ్, వేం నరేందర్‌రెడ్డిలను రాజ్యసభకు పంపామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం గ్రామ గ్రామాన పేదలకు ఏడు లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తోందన్నారు. ‘గత ప్రభుత్వం పదేళ్లు పాలించింది. ఆ కాలంలో పేదల కోసం 20 లక్షల ఇళ్లు నిర్మించి ఉండాల్సింది. కానీ పేదోడి ఇంటిపై వారికి ఆలోచన లేదు’ అని పేర్కొన్నారు.
బీసీ కులగణన.. ఎస్సీ వర్గీకరణ
బీసీ కులగణన చేపట్టి సామాజిక న్యాయానికి బాటలు వేసిన తొలి ప్రభుత్వం తమదేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని చెప్పారు. ప్రగతి భవన్, సచివాలయానికి ప్రజలను రానివ్వని గత పాలనకు భిన్నంగా తమ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటోందన్నారు. అందెశ్రీ పాటకు విముక్తి కల్పించామని, గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపే చర్యలు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన సుమారు రూ.8.11 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని, ఏటా సుమారు రూ.75 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని సీఎం తెలిపారు. అయినప్పటికీ రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రూ.95 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని, ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా, మీడియా వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన సీఎం.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తర్వాత 117 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి కొలువుదీరుతుందని అన్నారు. ‘దిశ సరిగ్గా లేకపోతే దశ సరిగ్గా ఉండదు. రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంత రావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విప్ బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ,బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

