Telangana Sports Hub: క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం: తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ స్టేడియంలో హెలీప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని అధికారులకు సూచించారు. స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు.
Also read-CM Revanth Reddy: ‘క్రీడల్లో రాణించాల్సిన యువత మత్తు బారిన పడటం బాధాకరం’
స్పోర్ట్స్ హబ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ: గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్టేడియం అభివృద్ధి విషయంలో స్పోర్ట్స్ హబ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్ ఉపాసన కొణిదెల, సభ్యులు కావ్య మారన్‌తో పాటుగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

