CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో సీఎం తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో సీనియర్లకు జరిగిన అవమానాలను జీవన్ రెడ్డి మర్చిపోయారా.. అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌లో సీనియర్లకు అవమానం: కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోందనే విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను సీఎం గుర్తుచేశారు. “జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే కాంగ్రెస్‌లో సీనియర్లకు గౌరవం లేదని మాట్లాడుతున్న జీవన్ రెడ్డి.. గతంలో బీఆర్ఎస్ నుండి సీనియర్ నేతలు ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని అన్నారు.
Also read- Jeevan Reddy : కారెక్కనున్న జీవన్ రెడ్డి.. బీఆర్‌ఎస్ అధినేతతో భేటి!
కాలమే సమాధానం చెబుతుంది: బీఆర్ఎస్‌లో సీనియర్లకు జరిగిన అవమానాలను జీవన్ రెడ్డి మర్చిపోయారా.. అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీలో కీలక సీనియర్ నేతలైన ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్‌కు జరిగిన అవమానాన్ని యావత్ తెలంగాణ సమాజం చూసిందని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుత పరిస్థితిని గుర్తుచేస్తూ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన సీనియర్ నేతలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వారందరికీ సముచిత స్థానం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కొందరు కావాలని చేస్తున్న విమర్శలకు కాలమే సరైన సమాధానం చెబుతుందని అభిప్రాయపడ్డారు.

