HomeTop StoriesCM Revanth Reddy: "కిషన్‌రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు"

CM Revanth Reddy: “కిషన్‌రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు”

CM Revanth Reddy: హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఓ కీలక నేత దిల్లీలో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని పరోక్షంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి బీజేపీలోనే ఉంటూ.. బీఆర్ఎస్‌కు సహకరిస్తారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు రావడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్‌ చేశారు. ఉప్పల్‌ భగాయత్‌ వేదికగా రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

నదుల ప్రక్షాళన అక్కడ ఒకలా.. ఇక్కడ మరోలా?: నదుల ప్రక్షాళన విషయంలో బీజేపీ ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “గుజరాత్‌లో సబర్మతి, దిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్‌లను అభివృద్ధి చేసుకున్నారు. యూపీలో గంగానదిని ప్రక్షాళన చేశామని సీఎం యోగి, ప్రధాని మోదీలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి హైదరాబాద్‌లో మేము మూసీ ప్రక్షాళన చేపడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఈ నెల 15 తర్వాత ప్రభుత్వం తరఫున కార్యాచరణ మారుతుందని సీఎం హెచ్చరించారు. మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వరో..రాష్ట్రంలోని మొత్తం ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదో, ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)కు నిధులు ఎందుకు ఇవ్వరో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలని, మంచి పనుల విషయంలో అడ్డుపడొద్దని హితవు పలికారు.

పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్‌ఎంసీ విభజన: ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపు 1.34 కోట్ల మంది జనాభా ఉన్నారని సీఎం రేవంత్‌ అన్నారు. ఇంతటి భారీ జనాభాకు సదుపాయాలు కల్పించడం ఆషామాషీ వ్యవహారం కాదని సీఎం పేర్కొన్నారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్‌ఎంసీ (GHMC)ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించామని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమేనంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికే ఉప్పల్‌లోనే కొత్త మున్సిపల్‌ ఆఫీసు ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు.

మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది: గతంలో రాజకీయంగా కిందపడిన తనను మళ్లీ ఎంపీగా గెలిపించి నిలబెట్టింది మల్కాజిగిరి ప్రజలేనని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. “అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఎంపీగా నేను అనుకున్న పనులు చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని, ఇక్కడి పరిసర ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటున్నాను” అని సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News