HomeTop StoriesCM Revanth: సర్కార్‌ విద్యలో నూతన విప్లవం.. నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం!

CM Revanth: సర్కార్‌ విద్యలో నూతన విప్లవం.. నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం!

Telangana Public School: రాష్ట్ర విద్యా రంగంలో సరికొత్త సంస్కరణలకు రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో.. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS) నేడు ప్రారంభం కానుంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యున్నత వసతులతో ఈ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దింది. ప్రభుత్వ విద్యలో నూతన విప్లవంగా భావించే ఈ స్కుల్‌ను నేడు సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఆరుట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

- Advertisement -

సీఎం పర్యటన షెడ్యూల్: సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆరుట్ల చేరుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను స్వయంగా పరిశీలిస్తారు. ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాక.. విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు.

విద్యా కమిషన్ పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలు: దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చైర్మ‌న్ డాక్టర్ ఆకునూరి మురళి, స‌భ్యులు పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, జోష్నా శివారెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందించనున్నారు.

 

 

కార్పొరేట్ స్థాయి సదుపాయాలు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఈ రోల్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అద్భుతమైన వసతులు కల్పిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం 5 ప్రత్యేక స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందిస్తారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ అత్యధునిక మైదానాలతో పాటు ప్రత్యేక కోచ్‌లనునియమించారు.

పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల పోటీ: కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్న ఆరుట్ల టీపీఎస్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భారీగా పోటీ పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీలో 150 మంది, ప్రైమరీలో 600 మంది, హైస్కూల్‌లో 800 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 160 మంది, ద్వితీయ సంవత్సరంలో 104 మంది ఉన్నారు. డిమాండ్ విపరీతంగా పెరగడంతో ప్రస్తుతానికి స్కూల్ వద్ద నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

Also read-Adluri Laxman: నిజమని తేలితే రాజీనామాకు సిద్ధం.. నువ్వు సిద్ధమా? హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్‌

పైలట్ ప్రాజెక్ట్‌గా 4 స్కూళ్లు.. లక్ష్యం 100 పాఠశాలలు: రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని రేవంత్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తొలి విడతగా నాలుగు పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లిలో నేడు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News