komaram bheem: సీఎం రేవంత్ రెడ్డి నేడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్: కొమరంభీమ్ జిల్లాలో సుమారు రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5:45 గంటలకు.. కెరిమరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి రాష్ట్రంలో రెండో విడత కింద 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను సీఎం మంజూరు చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడి.. వారి సాధకబాధకాలను తెలుసుకుంటారు.
కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ: రాత్రి 7:00 గంటలకు కొఠారి గ్రామం నుంచి రోడ్డు మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

