Cold Weather in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. అనేక ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండటంతో పాటుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతున్నప్పటికీ.. సాయంత్రం సమయంలో మాత్రం చాలా వేగంగా పతనం అవుతున్నాయి.
రికార్డు అయిన అత్యల్ప ఉష్ణోగ్రతలు: మంగళవారం రాష్ట్రంలో అనేక చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో(8.7 డిగ్రీల సెల్సియస్) అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్ పట్టణంలో 11.2 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు అయ్యింది. భద్రాచలం, నిజామాబాద్‌లో మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చే వారం మరింత చలి: రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వచ్చే వారం నుంచి మరింతగా తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఈ మార్పులు వేగంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం సైతం లేకపోలేదని అన్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వాహన చోదకులు తెల్లవారుజాము ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చలితో వణికిపోతున్న మున్సిపల్ కార్మికులు: తెల్లవారుజామున చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో.. ఆ సమయంలో పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, మున్సిపల్ కార్మికులు చలితో వణికిపోతున్నారు. మార్నింగ్ వాకర్స్, అయ్యప్ప భక్తులు, కార్తీక పౌర్ణమి వేళ తెల్లవారుజామున పూజలు చేసుకునే మహిళలు, పేపర్‌బాయ్‌లు, ప్రయాణం చేసేవారు, అలాగే ఆర్టీసీ డ్రైవర్‌లు చలితో తెగ ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా బడికి పిల్లలను పంపించే తల్లులు సైతం ఈ చలికి తట్టుకోలేక పోతున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.


