HomeTop StoriesSIR: ఎస్‌ఐఆర్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు: కాంగ్రెస్ నిప్పులు

SIR: ఎస్‌ఐఆర్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు: కాంగ్రెస్ నిప్పులు

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

- Advertisement -

 ఖమ్మంలో భారీ నిరసన ప్రదర్శన.. పెద్దఎత్తున తరలిరావాలని తల్లాడ నేతల పిలుపు

​తల్లాడ, (తెలుగు ప్రభ) :భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆదేశాలతో బుధవారం మండల పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగునూరి లక్ష్మారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ ఇన్‌చార్జులు, డీసీసీ కార్యదర్శి ముడుముంతల గంగరాజు, అధికార ప్రతినిధి పమ్మి అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల వేలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి ఓటు హక్కే రక్షణ కవచమని, దానిని హరించే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ విధానంతో ఓట్ల తొలగింపునకు ఆస్కారం లేకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని లేదా ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు స్పష్టం చేశారు.

​ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని, ఇందులో భాగంగానే అక్టోబర్ 8న (గురువారం) ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోరు కార్యక్రమానికి తల్లాడ మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. “ఓటు మన హక్కు – ఓటు మన భవిష్యత్తు” నినాదంతో ఎస్‌ఐఆర్‌ను రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదని వారు పునరుద్ఘాటించారు.

​ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండేటి వీరారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్, మల్లవరం సర్పంచ్ కటిక కిరణ్ కుమార్, అన్నారుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మలపల్లి రమేష్, నాయకులు కంచపోగు వెంకటేశ్వర్లు, నున్న శ్రీనివాసరావు, బాలాజీ సత్యనారాయణ రెడ్డి, రేగళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News