Kerala CM VD Satheesan: కేరళ తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేరళ నూతన సీఎంగా సీనియర్ నేత వీడీ సతీశన్(V.D. Satheesan) పేరును కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి పదవి కోసం కె.సి. వేణుగోపాల్, రమేశ్ చెన్నితల వంటి దిగ్గజ నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే పార్టీ హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది.
మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు: దిల్లీలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సుదీర్ఘ చర్చల అనంతరం సతీశన్ పేరును అధికారపక్ష నాయకుడిగా ప్రకటించారు. కేరళకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సైతం సతీశన్ నాయకత్వానికే మద్దతు పలికినట్లు తెలుస్తోంది. 2016 నుంచి అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన సతీశన్.. పినరయి విజయన్ స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

