• రాత్రికి కొట్టంలో..తెల్లారేసరికి మాయం
• జనం భయం..పెట్రోలింగ్‌పై ప్రశ్నలు
• వరుస చోరీలతో నిద్రలేని రాత్రులు
మర్రిగూడ, (తెలుగుప్రభ) :స్వేదం చిందించి సాకే నేలలో,కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే పాడిపశువులే ఆ రైతన్నకు లోకం.రోజులాగే శ్రమించి,సాయంత్రం వేళ ఆత్మీయంగా నిమిరి కొట్టంలో కట్టేసి వెళ్లిన ఆ ఆవులు తెల్లారేసరికి కనిపించకుండా పోయాయి!కంటికి రెప్పలా కాపాడుకున్న ఆవులను దుండగులు ఎత్తుకెళ్లడంతో ఆ పేద రైతు గుండె పగిలింది.నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
అర్ధరాత్రి పంజా విసిరిన దుండగులు
బాధితుడు,స్థానికుల కథనం ప్రకారం.. రాంరెడ్డిపల్లి శివారులోని తన వ్యవసాయ పొలంలో గ్రామానికి చెందిన రైతు అబ్బనగోని కృష్ణయ్య శనివారం సాయంత్రం రెండు ఆవులను ఎడ్ల కొట్టంలో భద్రంగా కట్టివేసి ఇంటికి వెళ్లారు.అర్ధరాత్రి వేళ గ్రామం నిద్రలో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు కొట్టంలోకి చొరబడి ఆ రెండు ఆవులను చోరీ చేసి పారిపోయారు.
రూ.లక్ష ఆస్తి నష్టం..విలపిస్తున్న కుటుంబం
ఆదివారం ఉదయాన్నే ఆవులకు మేత వేసేందుకు పొలం వద్దకు వెళ్లిన కృష్ణయ్యకు కొట్టంలో ఆవులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.చోరీకి గురైన ఆవుల విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.కష్టకాలంలో జీవనాధారంగా నిలిచిన పాడిపశువులు మాయమవ్వడంతో కృష్ణయ్య కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
భయాందోళనలో గ్రామాలు…
గత కొన్ని రోజులుగా మర్రిగూడ మండలంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ప్రజలు,రైతులు రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.నిరంతరం భయంతో గడుపుతున్నామని,పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పెట్రోలింగ్ ముమ్మరం చేసి, కృష్ణయ్య ఆవులతో పాటు గతంలో చోరీకి గురైన బంగారం, నగదును రికవరీ చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు.

