CP Sajjanar press conference : ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవి హార్డ్ డిస్క్‌లలో 21 వేల సినిమాలు ఉన్నట్టుగా గుర్తించామని హైదరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపారు. పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. రవి అరెస్ట్‌పై సినీ ప్రముఖలతో కలిసి హైదరాబాద్ సీపీ మీడియా సమావేశం నిర్వహించారు.
అతడితోనే ‘ఐ బొమ్మ’ను క్లోజ్ చేయించాం: పైరసీని అరికట్టే క్రమంలో ‘ఐ బొమ్మ’ రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపారు. దమ్ముంటే పట్టుకోండంటూ ‘ఐ బొమ్మ’ రవి గతంలో పోలీసులకే సవాల్ విసిరిన అంశాన్ని సీపీ గుర్తుచేశారు. అందుకే ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరే దమ్ము అతడికి ఉంటే.. అతడితోనే ఐ బొమ్మ యాప్‌ను క్లోజ్ చేయించే సత్తా పోలీసులకు ఉందని సీపీ సజ్జనర్ అన్నారు.
హార్డ్ డిస్క్‌లలో 21 వేల సినిమాలు: ‘ఐ బొమ్మ’ రవిపై ఇప్పటి వరకు మూడు పైరసీ కేసులు ఉన్నయని సీపీ తెలిపారు. పైరసీతో సినీ ఇండస్ట్రీకి తీరని నష్టం జరిగిందని అన్నారు. ఇమ్మడి రవి బెట్టింగ్ యాప్‌లను సైతం నడిపిస్తున్నట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లతో సమాజానికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. రవి హార్డ్ డిస్క్‌లలో 21 వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జనర్ తెలిపారు. పైరసీ ద్వారా ఇమ్మడి రవి ఇప్పటివరకు రూ. 20 కోట్లు సంపాదించినట్టుగా గుర్తించామని అన్నారు. అందులో రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్టుగా తెలిపారు. ఐ బొమ్మ రవి కేసు విషయంలో ఇంటర్నేషన్ లింక్స్ ఉన్నాయని హైదరాబాద్ సీపీ తెలిపారు. అందుకే ఈ కేసు విషయంలో జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/cybercrime-police-blocked-ibomma-and-bappam-websites/
‘ఐ బొమ్మ’ రవిది మాస్టర్ మైండ్: డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని హైదరాబాద్ సీపీ సజ్జనర్ అన్నారు. మార్నింగ్ విడుదలైన సినిమా.. సాయంత్రానికి ఐ బొమ్మ రవి దగ్గర ఉండేదని తెలిపారు. విశాఖకు చెందిన ఐబొమ్మ రవి.. మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిపారు. ఇమ్మడి రవిది మొదటి నుంచి క్రిమినల్ మైండేనని సీపీ పేర్కొన్నారు.
వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఆరితేరిన రవి: వెబ్‌సైట్ డిజైన్, డెవలపింగ్‌లో ‘ఐ బొమ్మ’ రవి ఆరితేరాడని సీపీ సజ్జనర్ అన్నారు. ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే.. మరో సైట్‌ను డెవలప్ చేసేవాడని తెలిపారు. సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేసేవాడని అన్నారు. ఆయన నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. కస్టడీకి ఇస్తే ‘ఐ బొమ్మ’ రవి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తామని సీపీ అన్నారు.

