Viral: ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా.. కన్నవారిని ఆదరించని ఆధునిక మానవ సంబంధాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. చివరి ప్రయాణంలో ఆయన అనాథ శవంగా మారిన వేదన అందరినీ కలచివేస్తోంది. కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా పిల్లలు రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందని భావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026
సజ్జనార్ తీవ్ర ఆగ్రహం: ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం” అని పేర్కొన్నారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు బంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లల ప్రాథమిక ధర్మమని గుర్తుచేశారు. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు సంపాదించినా ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివని ఆయన నిలదీశారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలని పిలుపునిచ్చారు.
Also Read-Viral: రాపిడో రైడర్‌ను వేధించిన మహిళ.. నెటిజన్ల ఆగ్రహం!

