Deputy CM Bhatti: తెలంగాణ మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ‘ప్రజా పాలన’కు ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రజలు ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు.
మధిర నా ప్రాణం: తన సొంత నియోజకవర్గం మధిరలో కాంగ్రెస్ సాధించిన అఖండ విజయంపై భట్టి విక్రమార్క భావోద్వేగానికి లోనయ్యారు. మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలకు గాను 21 స్థానాల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంపై ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మధిర ప్రజలు చూపిన ప్రేమ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రాష్ట్ర సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. మీ రుణం తీర్చుకోవడమే నా ఏకైక లక్ష్యంమని భట్టి పేర్కొన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిరను ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆధునిక మౌలిక వసతులు, సుందరీకరణతో మధిరను దేశంలోనే అత్యుత్తమ నగరంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నట్లు వెల్లడించారు.
Also read-CM Revanth Reddy: ‘ప్రజలకు ధన్యవాదాలు.. ఈ అఖండ విజయం బాధ్యతను మరింత పెంచింది’
విజయానికి పునాది పారదర్శకత: “ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని ఈ ఫలితాలు నిరూపించాయి. నిష్కల్మష నాయకత్వం, పారదర్శక పరిపాలన, సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది” అని భట్టి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం కలిసికట్టుగా సాగించిన అభివృద్ధి ప్రస్థానానికి ప్రజలు మద్దతు పలికారని ఆయన వివరించారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత కట్టుబాటుతో పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైన ఈ ప్రజాదరణ రానున్న రోజుల్లో రాబోయే భారీ మార్పులకు సంకేతమని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.

