Srivari Darshan: వేసవిసెలవులు కావడంతో కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు కిక్కిరిసిపోయాయి. గురువారం ఉదయం 8 గంటల సమయానికి ఉచిత దర్శనం కోసం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్ అయిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ భక్తులు క్యూలైన్లో స్వామివారి దర్శనానికి బారులు తీరడంతో.. కొన్నిగంటలపాటు సర్వదర్శనం క్యూలైన్ మూసివేశారు. దీంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
దర్శన సమయాల వివరాలు: రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి దర్శనం కోసం 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 4 నుండి 5 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వ్యవహరించాలని, క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ పానీయాలు, ఆహార సౌకర్యాలను నిరంతరం అందిస్తోందని అధికారులు తెలిపారు.
Also read-Saraswati pushkaralu: ప్రారంభమైన సరస్వతీ నది అంత్య పుష్కరాలు
రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం: బుధవారం రోజున తిరుమలలో భక్తుల తాకిడి రికార్డు స్థాయిలో నమోదైంది. మొత్తం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని 44,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 3.94 కోట్ల ఆదాయం సమకూరింది.

