Hindi Ban in Tamilnadu: తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, హిందీ పాటలు అలాగే హిందీలో ఉండే హోర్డింగ్స్, బహిరంగ ప్రకటనలను నిషేధించే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ బిల్లును ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభా సమావేశం చివరి రోజున ప్రవేశపెట్టే అవకాశముంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. హిందీ ఆధిపత్యాన్ని అలాగే తమ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దటాన్ని తప్పుపడుతోంది. తమిళ సంస్కృతితో పాటు తమ భాష గౌరవం, అస్థిత్వాన్ని కాపాడుకోవటానికే స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
సీఎం స్టాలిన్ చాలా కాలంగా రెండు భాషల విధానాన్ని సమర్థిస్తున్నారు. తమ రాష్ట్రంలో తమిళ్, ఇంగ్లీష్ భాషలను సమర్థిస్తోంది డీఎంకే ప్రభుత్వం. ఈ విధానం విద్య, ఉద్యోగావకాశాలతో పాటు నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి పెద్ద సహాయంగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా తీసుకొస్తున్న చట్టం అమలులోకి వస్తే.. హిందీ పాటలు, చిత్రాలు, హోల్డింగ్స్, యాడ్ బోర్డ్స్ తమిళనాట కనిపించవు.
అయితే మరోపక్క ఈ బిల్లుకు చట్టపరమైన పరిమితులతో పాటు అమలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులందరికీ మాట్లాడే స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కులు, భాషా స్వాతంత్ర్యానికి హామీ ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో హిందీని పూర్తిగా తమిళనాడులో ప్రభుత్వం నిషేధం చట్టపరంగా సవాళ్లకు దారితీయెుచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోపక్క చలనచిత్ర రంగంతో పాటు వ్యాపార వర్గాలకు కూడా చిక్కులు తెచ్చిపెట్టొ్చ్చని వారు అంటున్నారు. అలాగే తమిళనాడులో ఇకపై విదేశీ చిత్రాలు లేదా మల్టీ-లింగ్వల్ ప్రదర్శనలకు అనుమతి ఉంటుందా అన్న విషయంలోనూ ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది.
ప్రస్తుతం ముసాయిదా చట్టం రూపకల్పన దశలోనే ఉందని సమాచారం. తమిళనాడు ప్రభుత్వం తుది ముసాయిదాను పూర్తి చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజకీయంగా ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వంతో కొత్త వివాదాలకు దారితీయవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను దెబ్బతీయెుచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం ఘర్షనలను తగ్గిస్తూ తమిళానికి ప్రాధాన్యతను పెంచటంపై ఫోకస్ పెడితే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు.


