Generic Lenacapavir HIV prevention injection : ఎయిడ్స్ మహమ్మారిపై సాగుతున్న ప్రపంచ పోరాటంలో సరికొత్త సువర్ణాధ్యాయం లిఖితమైంది. హెచ్ఐవీ నివారణకు రోజువారీ మాత్రలతో విసిగిపోయిన బాధితులకు ఊరటనిస్తూ.. ఏడాదికి కేవలం రెండు మోతాదులతోనే పూర్తి రక్షణ కవచం తొడిగే ‘మేడ్ ఇన్ ఇండియా’ అద్భుతం సాకారమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషధ సంస్థ ‘డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్’ రూపొందించిన లాంగ్-యాక్టింగ్ ఇంజెక్షన్ ‘లెనకాపవిర్’ (Lenacapavir) జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ (US FDA) తాత్కాలిక ఆమోదం తెలిపింది. ఇంతకీ ఈ ఇంజెక్షన్ పనితీరు ఏమిటి? పేద దేశాల తలరాతను ఇది ఎలా మార్చనుంది.
16 నెలల్లోనే రికార్డు ఆవిష్కరణ: గిలియడ్ సైన్సెస్ (Gilead) భాగస్వామ్యంతో యునైటెడ్ (Unitaid), క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ (CHAI), విట్స్ ఆర్హెచ్ఐ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ఈ ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ఒరిజినేటర్ ఔషధం వచ్చిన కేవలం 16 నెలల వ్యవధిలోనే అమెరికా ‘పెప్‌ఫార్’ (PEPFAR) నిబంధనల కింద అనుమతి సాధించడం ప్రపంచ వైద్య చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మైలురాయిగా నిలిచింది.
అందుబాటు ధర.. 120 దేశాలకు సంజీవని: అమెరికాలో ఈ ఔషధ ధర ఏడాదికి వేల డాలర్లలో ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం ప్రకారం కేవలం 40 డాలర్లకే (సుమారు ₹3,400) అందించనుంది. లైంగిక సంక్రమణ ద్వారా వ్యాపించే హెచ్ఐవీ-1 ముప్పును ఇది దాదాపు సంపూర్ణంగా నివారిస్తుంది. దాదాపు 120 అల్పాదాయ, మధ్యతరగతి దేశాల్లోని కోట్లాది మందికి ఇది వరం కానుంది. 2026 డిసెంబర్ నాటికి ఆఫ్రికా దేశమైన జాంబియా తదితర ప్రాంతాలకు తొలి విడత సరఫరా ప్రారంభమై, 2027 నాటికి విస్తృతంగా అందుబాటులోకి రానుంది. భారత ఫార్మా సత్తా గ్లోబల్ హెల్త్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి ఇదే ప్రబల నిదర్శనం.

