Ebola symptoms: బెంగళూరులో ఎబోలా వైరస్ కలకలం రేపింది. ఎబోలా లక్షణాలతో బాధపడుతున్న ఓ విదేశీ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళ ఆఫ్రికాలోని ఉగాండాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ: ఆమె ఇటీవల.. ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం. మహిళకు ఎబోలా తరహా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆమెను ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Also read-Ebola Virus: ఎబోలా కలవరం.. కీలక ఆదేశాలు జారీ చేసిన భారత్!
ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు ప్రయాణాలు చేయవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలలో ఎబోలా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఒకవేళ తప్పనిసరైతే పూర్తి అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచించారు.

