Telangana: మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జారీ చేసే ‘విప్’ అత్యంత కీలకం కానుంది. విప్‌ను ధిక్కరించే సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం శనివారం స్పష్టమైన సర్క్యూలర్‌ను జారీ చేసింది. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
విప్ ధిక్కరిస్తే చర్యలు ఇలా: గుర్తింపు పొందిన పార్టీల తరపున గెలిచిన సభ్యులు పార్టీ ఆదేశాలను (విప్) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విప్‌ను ధిక్కరిస్తే.. విప్ ధిక్కరణ జరిగిన 3 రోజులలోపు పార్టీ నియమించిన వ్యక్తి, సదరు సభ్యుని పేరుతో సహా కలెక్టరుకు రాతపూర్వక నివేదిక సమర్పించాలి. నివేదిక అందిన వెంటనే అధికారులు సదరు సభ్యునికి కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. దీంతో తనపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో వివరణ ఇచ్చేందుకు సభ్యునికి 7 రోజుల గడువు ఉంటుంది. సభ్యుడు ఇచ్చే వివరణను పరిశీలించి.. అది అందిన రెండు రోజుల్లోపు అధికారులు తుది ఉత్తర్వులు జారీ చేయాలి. ఒకవేళ సభ్యుడు 7 రోజుల్లోపు స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతోనే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు.
అధికారులకు శిక్షణ పూర్తి: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రిసైడింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి ఎన్నికల సంఘం శనివారం వర్చువల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చింది. మాస్టర్ ట్రైనీల ద్వారా నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
తనిఖీల్లో రూ. 2.02 కోట్ల నగదు, వస్తువులు సీజ్: ఎన్నికల కోడ్ (MCC) అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
- మొత్తం సీజ్ చేసిన విలువ: రూ. 2.02 కోట్లు
- నగదు: రూ. 89.30 లక్షలు
- మద్యం: రూ. 84.89 లక్షల విలువైన లిక్కర్
- ఇతరాలు: రూ. 13.27 లక్షల విలువైన డ్రగ్స్, రూ. 14.69 లక్షల విలువైన బంగారం/వెండి మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు.

