బేతంచెర్ల, తెలుగు ప్రభ:ఎల్ నినో ప్రభావంతో పంటలపై పడే దుష్ప్రభావాల గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బేతంచెర్ల మండలంలో పర్యటించారు.శనివారం మండలంలోని కొలుములపల్లె, శంకరాపురం, సీతారామాపురం, H.కొట్టాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శాస్త్రవేత్తలు రైతులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్, ఆదినారాయణ, రవిగౌడ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల మొక్కజొన్న, వేరుశనగ, పత్తి వంటి ప్రధాన పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.
బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి..
ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సేంద్రీయ ఎరువుల వాడకం, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి నీటి ఆదా పద్ధతులను అనుసరించాలని సలహా ఇచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పంటల బీమా, వాతావరణ సమాచారం గురించి కూడా రైతులకు అవగాహన కల్పించారు. అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను, కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

