HomeTop StoriesResults day: నేడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ!

Results day: నేడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ!

Election Results: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 823 అసెంబ్లీ స్థానాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దీంతో ఎన్నికల సంఘం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.

- Advertisement -

కౌంటింగ్ ప్రక్రియ ఇలా..

  • ఉదయం 8:00: కౌంటింగ్ ప్రారంభం. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
  • ఉదయం 8:30: ఈవీఎంల లెక్కింపు షురూ అవుతుంది.
  • మధ్యాహ్నం 12:00: మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదనే అంశంపై స్పష్టమైన ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది.

బెంగాల్ పైనే అందరి దృష్టి: బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ 293 స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మళ్లీ విజయం సాధిస్తుందా? లేక బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టిస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 92.47% పోలింగ్ నమోదు కావడం విశేషం.

విజయ్ మ్యాజిక్ చేస్తారా?: 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకే కూటమి బలమైన ఆధిక్యంలో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం విజయ్ కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్‌గా నిలుస్తారా అనేది చూడాలి. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీతో అన్నాడీఎంకే మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే వైపు ప్రజలు మొగ్గుచూపలేదని సర్వేలు చెబుతున్నాయి. అయితే మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.

సీపీఎంకు ఇది జీవన్మరణ సమస్య: లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడో విజయంపై ధీమాగా ఉంది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మార్పును ఆశిస్తోంది. దీంతో సీపీఎంకు ఇది జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రచారం ప్రభావం ఎంత ఉండనుందో మరి కాసేపట్లో తేలనుంది.

అస్సాం ఎన్డీయే పట్టు కాయమే!: హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ను గద్దె దించాలని కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నం చేసింది. కానీ సర్వేల ఆధారంగా చూస్తే అస్సాం ప్రజలు మళ్లీ ఎన్డీయేకే పట్టం కట్టేలా కనిపిస్తున్నారు. ఇక పుదిచ్చేరి ఎన్నికల ఫలితాల విషయంలో కూడా ఆసక్తి నెలకొంది. కేవలం 30 సీట్లు ఉన్న ఇక్కడ.. చిన్న పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News