Ind Vs Eng: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమ్‌ఇండియాను ఓటముల పరంపర కొనసాగుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లోనూ భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యింది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తయింది. దీంతో 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
76 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా: 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టాంగ్ (4/28), జోఫ్రా ఆర్చర్ (3/29) వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభమే దక్కింది. 1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రెండు సిక్సర్లతో యువ కెరటం సూర్యవంశీ (13) జోరు మీదున్నా.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒకే ఓవర్ వ్యవధిలో అభిషేక్ (10), సూర్యవంశీ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత పరుగుల రాక మందగించగా వికెట్లు మాత్రం వరుసగా పడుతూ వచ్చాయి. ఇషాన్ కిషన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) ఘోరంగా విఫలమవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తిలక్ వర్మ (3), శివమ్ దూబే (2) కూడా నిరాశపరచడంతో భారత్ ఓటమి చాలా ముందే ఖాయమైపోయింది.
మెరుపులు మెరిపించిన సాల్ట్: అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. ఆఖర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు), కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమైంది. తొలి ఓవర్ మెయిడిన్ కాగా, 3 ఓవర్లకు 19 పరుగులే వచ్చాయి. అయితే నాలుగో ఓవర్ నుంచి బట్లర్ గేర్ మార్చాడు. అక్షర్ వేసిన ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన బట్లర్, హర్షిత్ రాణా ఓవర్లోనూ అదే రీతిలో చెలరేగాడు. దీంతో 5 ఓవర్లకు ఇంగ్లాండ్ 43/0కు చేరుకుంది.
రాణించిన ప్రిన్స్ యాదవ్, హర్షిత్: ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత బౌలర్ ప్రిన్స్ యాదవ్ తన మొదటి బంతికే ప్రమాదకర బట్లర్‌ను బౌల్డ్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుదురుకునే ప్రయత్నం చేసిన బ్రూక్ (16)ను కూడా ప్రిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒకవైపు సాల్ట్ అటాకింగ్ ఆడుతున్నా, మరోవైపు వికెట్లు పడుతూనే వచ్చాయి. 12వ ఓవర్లో హర్షిత్ రాణా ఇంగ్లాండ్‌కు డబుల్ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో గత మ్యాచ్ టాప్ స్కోరర్ బెథెల్ (13), బాంటన్ (0)లను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 111 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దశలో సాల్ట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, అతడికి సామ్ కరన్ తోడై భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు 200 దాటింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

