అన్నపురెడ్డిపల్లి (తెలుగుప్రభ):ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా గాడితప్పాయి. ఇక్కడ వైద్యం కోసం వస్తున్న రోగులకు నిరాశే మిగులుతోంది. ఆసుపత్రిలో కనీస వసతులు, మందులు కొరవడటంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
సిరంజీలకూ కటకటే..
సాధారణ జ్వరం, ఒంటి నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లే రోగులకు అక్కడ పరిస్థితి చూసి షాక్ తినాల్సి వస్తోంది. ఆసుపత్రిలో జ్వరానికి లేదా ఇతర నొప్పులకు ఇవ్వాల్సిన సాధారణ మందులు కూడా స్టాక్ లేవని సిబ్బంది చెబుతున్నారు. అంతకంటే విడ్డూరం ఏంటంటే.. రోగులకు నరాల ద్వారా లేదా కండరానికి వేయాల్సిన ఇంజెక్షన్‌కు కనీసం ‘సిరంజీలు’ కూడా అందుబాటులో లేవని తేల్చిచెబుతున్నారు. దీంతో రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచితంగా వైద్యం అందుతుందని ఆశతో వస్తే.. ఇక్కడ సిరంజీలు కూడా లేవనడంతో చేసేది లేక వారు తమ జేబు నుంచి డబ్బులు వెచ్చించి బయట మెడికల్ షాపుల్లో సిరంజీలు, మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పేదరికంతో సతమతమయ్యే గిరిజన, గ్రామీణ ప్రజలకు ఈ కొనుగోళ్లు భారంగా మారుతున్నాయి.
డాక్టర్ ఉన్నా లేనట్టే..
ఇక ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల తీరుపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యాధికారి ఉన్నా లేనట్టే అన్నట్లుగా వ్యవహారాలు సాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. సమయపాలన పాటించకపోవడం, రోగులను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్యం అందక రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.
అధికారుల పర్యవేక్షణ శూన్యం..
ఎర్రగుంట పీహెచ్సీలో నెలకొన్న ఈ దుస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దృష్టిసారించాలని.. మందులు, సిరంజీల కొరతను వెంటనే తీర్చి, నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.

