Tamil Nadu Politics: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పగ్గాలు చేపట్టకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐడీఎంకే వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు చెన్నైకి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ద్రవిడ పార్టీల మధ్య సయోధ్యకు షా ప్రయత్నం?: దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర్చేందుకు అమిత్ షా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. అటు స్టాలిన్, ఇటు పళనిస్వామి వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి.. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
న్యాయపోరాటానికి టీవీకే సిద్ధం!: మరోవైపు అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని.. ఇతర కూటములను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఊరుకునేది లేదని తమిళగ వెట్రి కజగం(టీవీకే) హెచ్చరిస్తోంది. నిబంధనల ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమకే మొదటి అవకాశం ఇవ్వాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. ఒకవేళ గవర్నర్ తమను కాదని వేరే పార్టీలను ఆహ్వానిస్తే.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాలని విజయ్ యోచిస్తున్నారు. ఇప్పటికే ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Also read-West Bengal: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. రంగంలోకి దిగిన బలగాలు!
నిపుణుల అభిప్రాయం: రాజ్యాంగ నిబంధనల ప్రకారం, స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవడమే సరైన పద్ధతని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడి బలాన్ని నిరూపించుకుంటే పరిస్థితి మారే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు అమిత్ షా పర్యటన మరియు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

