– ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలి
– ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాలి
– కలెక్టర్‌కు FAPTO కర్నూలు జిల్లా శాఖ వినతి
కర్నూలు, (తెలుగు ప్రభ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ విధులతో పాటు కౌంటింగ్ విధులను కూడా వెంటవెంటనే కేటాయించడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని FAPTO కర్నూలు జిల్లా శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని విధుల కేటాయింపులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది. ఈ మేరకు నవంబర్ 3న వినతిపత్రం సమర్పించింది. ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, అయితే పోలింగ్ విధులు పూర్తయిన వెంటనే తగిన విశ్రాంతి లేకుండా కౌంటింగ్ విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు మరుసటి రోజు కౌంటింగ్ శిక్షణకు హాజరుకావాల్సి రావడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయిస్తే ఎన్నికల ప్రక్రియలో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దూర ప్రాంతాల సిబ్బందికి మరింత ఇబ్బంది:
కర్నూలు నుంచి కౌతాళం, కౌతాళం నుంచి ఓర్వకల్లు, హాలహర్వి నుంచి కల్లూరు వంటి సుదూర ప్రాంతాలకు విధులు కేటాయించిన ఉపాధ్యాయులకు రెండు బాధ్యతలు అప్పగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నవంబర్ 5న ఎన్నికల రోజున రిసెప్షన్ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి ఎప్పుడు అప్పగిస్తారో, విధులు ఎన్ని గంటలకు ముగుస్తాయో స్పష్టత లేకుండానే, నవంబర్ 6వ తేదీ ఉదయమే కౌంటింగ్ శిక్షణకు హాజరుకావాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి:
పోలింగ్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే కౌంటింగ్ విధులు కేటాయించకుండా తగిన విశ్రాంతి కల్పించాలని FAPTO కోరింది. వారి స్థానంలో అందుబాటులో ఉన్న ఇతర సిబ్బందిని నియమించాలని, అవసరమైతే కౌంటింగ్ విధుల నుంచి మినహాయింపు లేదా విధుల మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వరుస విధులు కేటాయించాల్సి వచ్చినా తగిన విశ్రాంతి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరింది. విధుల కేటాయింపులో ఉపాధ్యాయుల వయస్సు, ఆరోగ్యం, ప్రయాణ దూరం, పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. FAPTO కర్నూలు జిల్లా ఛైర్మన్ యం. మధుసూదన రెడ్డి, జిల్లా సెక్రటరీ జనరల్ జి. భాస్కర్ ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

