HomeTop StoriesBhupalpally: కళ్లెదుటే భర్త సజీవదహనం.. కాపాడబోయి భార్య సైతం..!

Bhupalpally: కళ్లెదుటే భర్త సజీవదహనం.. కాపాడబోయి భార్య సైతం..!

Bhupalpally: పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం ప్రాణ సంకటంగా మారుతోంది. మీడియా, పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు రైతులు అవలంబిస్తున్న అనాలోచిత విధానాలు ఊహించని విషాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటువంటి ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పంట వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో మంటలు అదుపుతప్పి.. భార్యాభర్తలను బలితీసుకుంది. వరికొయ్యల మంటల్లో చిక్కుకుని రైతు దంపతులు మృతి చెందిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మాటల్లో వ్యక్తపరచలేని శోకాన్ని మిగిల్చింది.

- Advertisement -

కళ్లెదుటే భర్త సజీవదహనం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లె గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి (60), భాగ్య (55) దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలకూ వివాహాలు చేసి..”బాధ్యతలన్నీ తీరిపోయాయి.. ఇక హాయిగా బతుకుదాం” అనుకుంటున్న తరుణంలో ఈ వృద్ధ దంపతులను ఊహించని మృత్యువు కబళించింది. శనివారం నాడు చంద్రమౌళి, భాగ్యమ్మ దంపతులు తమ పొలంలో వరి కొయ్యకాళ్లను తగలబెట్టేందుకు చేనుకు వెళ్లారు. గడ్డికి నిప్పు పెట్టగానే.. ఒక్కసారిగా వీచిన గాలికి మంటలు భీకరంగా విస్తరించాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఇతర పొలాల్లోకి వేగంగా వ్యాపించసాగాయి. ప్రమాదాన్ని గ్రహించిన చంద్రమౌళి మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే పొగ, సెగల తీవ్రతకు ఆయన మంటల మధ్యలోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు.

భర్తను కాపాడబోయి భార్య సైతం: కళ్లెదుటే భర్త మంటల్లో కాలిపోతుండటం చూసి తట్టుకోలేకపోయిన భాగ్యమ్మ.. పెద్ద పెట్టున కేకలు వేస్తూ భర్తను బయటకు లాగేందుకు మంటల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాధితుల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల రైతులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూశారు.

కన్నీరుమున్నీరవుతున్న గ్రామం: “చంద్రమౌళి చాలా మంచి వ్యక్తి, ఎవరికీ ఎన్నడూ అపకారం తలపెట్టలేదు. పిల్లలందరినీ ఒక ఇంటివారిని చేసి.. ప్రశాంతంగా జీవిద్దామనుకున్న సమయంలో ఇలా జరగడం అత్యంత దారుణం” అంటూ రేపాకపల్లె గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల ఆక్రందనలు అక్కడి వారిని కలచివేశాయి. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు (MLA) గండ్ర సత్యనారాయణరావు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రైతులు ఎవరూ కూడా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News