Sunday, January 18, 2026
HomeTop StoriesElection: తొలివిడత పల్లెపోరులో కాంగ్రెస్ సత్తా.. 2,383 సర్పంచ్ స్థానాల్లో విజయం!

Election: తొలివిడత పల్లెపోరులో కాంగ్రెస్ సత్తా.. 2,383 సర్పంచ్ స్థానాల్లో విజయం!

Panchayat election results: తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. గురువారం జరిగిన పోలింగ్ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవాలతో సహా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. పలుచోట్ల గట్టి పోటీనిచ్చిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీల్లో విజయం సాధించారు.

- Advertisement -

పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థుల వివరాలు:

  • కాంగ్రెస్ పార్టీ: 2,383
  • బీఆర్‌ఎస్: 1,146
  • స్వతంత్ర అభ్యర్థులు: 455 స్థానాలు
  • సీపీఎం: 14 స్థానాలు
  • సీపీఐ: 16 స్థానాలకు పైగా
  • బీజేపీ: 200 లోపు స్థానాలకు పరిమితమైంది.

84.28% పోలింగ్ నమోదు: శీతాకాలమైనప్పటికీ ఓటర్లు ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నిక జరిగిన ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,834 సర్పంచ్, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో మొత్తం 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం పోలింగ్ జరగగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి.

అర్ధరాత్రి దాకా కొనసాగిన కౌంటింగ్ ఉత్కంఠ: మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 23,15,796 మంది మహిళలు కాగా 21,99,267 మంది పురుషులు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనేక చోట్ల ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఉత్కంఠభరితంగా లెక్కింపు జరగడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాకా కూడా కొనసాగింది.

Also Read:  పల్లె పోరులో చిత్రవిచిత్రాలు.. లాటరీతో సర్పంచ్, అంబులెన్స్‌లో వచ్చి ఓటు!

జిల్లాల వారీగా కాంగ్రెస్ పట్టు: నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.సిద్దిపేట జిల్లాలో మాత్రం భారత రాష్ట్ర సమితి ముందంజలో ఉంది. మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News