First semi final match: టీ20 వరల్డ్ కప్‌లో అసలైన వేట మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెమీఫైనల్ సమరానికి ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. తొలిసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న సఫారీలు: ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. గ్రూప్ దశ నుంచి సూపర్-8 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు దూసుకొచ్చింది. కెప్టెన్ మార్క్‌రమ్ భీకర ఫామ్‌లో ఉండడం జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్ ఏ క్షణమైనా స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలదు. బౌలింగ్‌లో సైతం సఫారీలదే పై చేయిలా ఉంది. ఎంగిడి, బోష్, యాన్సెన్ తలా 10కి పైగా వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికిస్తున్నారు. స్పిన్ విభాగంలో కేశవ్ మహరాజ్ పరుగులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సఫారీలతో కివీస్ అమీతుమీ!: మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగింది. సూపర్-8లో ఆఖరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఇతర సమీకరణాల వల్ల కివీస్ జట్టు సెమీస్ చేరింది. అయితే ఈడెన్‌లో సఫారీలను అడ్డుకోవాలంటే అద్భుతం చేయాల్సిందే. ఓపెనర్ సీఫెర్ట్ (216 పరుగులు) శుభారంభం అందించడంపైనే జట్టు ఆశలు ఉన్నాయి. రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ తమ స్థాయికి తగ్గట్టు రాణించాల్సి ఉంది. కెప్టెన్ శాంట్నర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు బలం. అయితే నాణ్యమైన రిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, ఇష్ సోధి ఫామ్‌లో లేకపోవడం కివీస్‌ను కలవరపెడుతోంది.
రికార్డులు ఏం చెబుతున్నాయంటే: ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడిన ఐదు సందర్భాల్లోనూ సఫారీలే విజయం సాధించారు. ఈ మానసిక పైచేయి దక్షిణాఫ్రికాకు ప్లస్ పాయింట్ కానుంది.
బ్యాటింగ్‌కు స్వర్గధామం: ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. వర్షం ముప్పు లేనప్పటికీ.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్-8లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

