ఫరెవర్ కెమికల్స్ ఉత్పత్తితో తుంగభద్ర, కృష్టా జలాలకు.. తద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎదురయ్యే ఇబ్బందులు, తదనంతర పరిణామాలపై తెలుగుప్రభ “హైదరాబాద్‌కు చైనా ఉరి” శీర్షికతో ప్రచురించిన వివరణాత్మక, విశ్లేషణాత్మక కథనంపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు పెద్ద ఎత్తున స్పందించాయి. రాయలసీమ విద్యవంతుల వేదిక మొదలు పర్యావరణ సంస్థల దాకా అనేక సంఘాల ప్రతినిధులు తెలుగుప్రభకు అభినందనలు తెలియజేశారు.
ఫరెవర్ కెమికల్స్‌కు సంబంధించిన అంశాలను సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచురించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీజీవీ కంపెనీ చేపట్టనున్న ఉత్పత్తి ప్రోటోకాల్‌ను, ఎస్‌ఓపీని బయపెట్టి వాళ్ల నిజాయితీని చాటుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మెసేజ్‌లు, మెయిల్స్ రూపంలో అభినందనలు వెల్లువెత్తాయి. సదరు పరిశ్రమకు పక్కనే ఉన్న తుంగభద్ర నదితో పాటు కృష్ణానది తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదముందన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలనే డిమాండ్ వచ్చింది.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు తెలుగుప్రభతో మాట్లాడారు. పర్యావరణం కలుషితం కావటాన్ని ఎవరూ హర్షించరని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత కాలుష్య నియంత్రణా మండలిదేనని ఆయన కుండబద్దలుకొట్టి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తొమ్మిది జిల్లాలు ఆ నీటిపై నేరుగా ఆధారపడి ఉన్నాయని, ఎగువనున్న ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉత్పత్తి చేసి, మన రాష్ట్ర జలవనరులను కలుషితం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆ కంపెనీ ప్రతినిధులను, కుటుంబసభ్యులను కూడా తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. అలాగే సదరు పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తి నిర్వహణా కార్యకలాపాల విస్తరణను అడ్డుకోవటానికి అవసరమైతే ఎన్జీటీని ఆశ్రయిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి.. తుంగభద్రతో పాటు కృష్ణాజలాలను విషపూరితం చేస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లను ఎత్తుకుపోతున్నారని, ఇంకా కలుషితం కూడా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈఐఏ నోటిఫికేషన్లో స్పష్టత కరువు:
పర్యావరణ మంత్రిత్వశాఖ 2006లో జారీచేసిన నోటిఫికేషన్ల ఆధారంగా కాలుష్య నియంత్రణా మండలి ఆయా కాలుష్యకారక సంస్థలు లేదా పరిశ్రమలపై కన్వీనర్ హెూదాలో జిల్లా అధికారులతో కలిసి, ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఇది ఎక్కడైనా సాధారణమే. కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్రంలోని రెండు జిల్లా పరిధుల్లో వచ్చే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సినప్పుడు రెండు జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ఈ తంతు ముగిస్తారు. టీజీవీ ఎస్ఆర్ఎసీఎల్ కంపెనీ విషయంలో ఒక గమ్మత్తైన అంశం ఏమిటంటే ఈ పరిశ్రమ ఆంధ్ర – తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. కాకపోతే పరిశ్రమ భూభాగం గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీంతో స్థానిక కాలుష్య నియంత్రణా మండలి అధికారులు ఈఐఏ -2006 నోటిఫికేషన్ను అనుసరించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించారు. అయితే ఈ నోటిఫికేషన్లోనే అంతర్లీనంగా మరో అంశం కూడా ఉంది. ఏ సంస్థ అయితే ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నదో ఆ సంస్థకు చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్లో పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలను ప్రజాభిప్రాయ సేకరణ వేదికలో సమర్పించి, వివరించాల్సి ఉంటుంది.
ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది, అలాగే నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక కూడా సమర్పించారు. ఇక్కడే అసలు సమస్య తెరపైకి వచ్చింది. ఈ పరిశ్రమకు 10 కిలోమీటర్ల పరిధిలో తెలంగాణ ప్రాంతం వస్తుంది. దీన్ని స్థానిక పీసీబీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఈఐఏ నోటిఫికేషన్లో రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ విధంగా వచ్చినప్పుడు ఏమిచేయాలో ఆ నోటిఫికేషన్లో పొందుపరచలేదు. ఇది కూడా కేంద్రానికి ఓ సవాలుగా మారింది. విచక్షణాధికారం ఉపయోగించి అధికారులు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది. ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసు ఇచ్చి, ఆయా గ్రామస్థులు కూడా అభిప్రాయ సేకరణలో పాల్గొనేలా చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. నిజానికి కంపెనీ ఉన్నది కర్నూలులోనే అయినా ఉత్పత్తి పర్యవసానాలు ఎదుర్కోవాల్సింది మాత్రం తెలంగాణ ప్రజలే. అందులోనూ తెలంగాణ జీవనాధారం కృష్ణానదిపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందన్నది పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే ఇప్పుడు తెలంగాణ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ వివాదంలో జోక్యం చేసుకుని అసలు ఈ కంపెనీ ఏ ఉత్పత్తులు చేపట్టనుంది? ఏ ప్రక్రియలో చేపట్టనుంది? దాని ద్వారా వచ్చే కాలుష్య పరిమాణం ఎంత? కాలుష్య నివారణకు ఏ విధమైన చర్యలు చేపడతారు? దిగువన ఉన్న నదులు ఎంత వరకు సురక్షితం? తదితర వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే పరిశ్రమకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిశ్రమలను నీటి వనరుల సమీపంలో, జనావాసాల మధ్య కాకుండా ప్రత్యేక సెజ్‌లో ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే తుంగభద్ర నది మొదలు కృష్టా ప్రవాహమంతటా విషమే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రజల నుంచి స్పందన లేదని ఆవేదన:
తెలుగుప్రభ కృషిని, నిబద్ధతను ప్రశంసిస్తూ అనేక మంది కార్యాలయం ఫోన్ నంబర్కు మెసేజ్లు పంపించారు. పీసీబి అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీల నాయకులు ప్రజల హక్కులను హననం చేస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు ఎదురవబోతున్నా, విధ్వంసం జరగబోతున్నా ప్రజల్లో స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫరెవర్ కెమికల్ ఉత్పత్తి వల్ల ప్రతి ప్రాణికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నదని, మృత్యువు ఎదురుగా వస్తుందన్న విషయాన్ని గమనించాలని కోరారు. పలువురు శాస్త్రవేత్తలు స్వచ్చందంగా చేస్తున్న పోరాటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తుంగభద్ర నదికి వందల మీటర్ల దూరంలోనే ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ వల్ల భావితరాలు ఎలా ఉంటాయన్నది తలుచుకుంటేనే భయంగా ఉన్నదని ఆ నదికి సమీపంలో జీవనం సాగిస్తున్న కొందరు అభిప్రాయపడ్డారు.
టీజీ వెంకటేష్ ఫ్యామిలీని హైదరాబాద్ లో తిరగనియ్యం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
టీజీ వెంకటేశ్ కు సంబంధించిన టీజీవీ ఎస్ఆర్ఎసీఎల్ ఉత్పత్తి చేయనున్న రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. దీంతో తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణా, తుంగభద్ర నదులు కలుషితం అవుతాయి. భవిష్యత్ లో హైదరాబాద్ లో తాగునీరు పూర్తిగా కలుషితం అయి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి. రాష్ట్రానికి హాని చేస్తూ స్వలాభం కోసం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తాం. టీజీ వెంకటేష్ ఫ్యామిలీని హైదరాబాద్ లో తిరగనియ్యకుండా అడ్డుకుంటాం.
పీసీబీదే బాధ్యత: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
టీజీవీ ఎస్ఆర్ఎఏసీఎల్ పరిశ్రమ విస్తరణతో తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణా, తుంగభద్ర నదులు కలుషితం అవుతాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను శాస్త్రీయంగా పరిశీలించి, ప్రాజెక్టు తదుపరి అనుమతులు ఇవ్వాలి. రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తీసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుతం అది ఏపీలోని కర్నూల్ లో నిర్మిస్తున్నారు, శాస్త్రీయంగా అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పీసీబీ పైనే ఉంది.
ప్రజల్లో చైతన్యం వస్తేనే నదుల్లో కలుషితం ఆపగలం: ఎం శ్యాం ప్రసాద్ రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం అధ్యక్షుడు రాష్ట్రంలో గోదావరి జలాలు కలుషితమయ్యాయి. వివిధ రక్తాల పరిశ్రమల ఏర్పాటు వల్ల గోదావరి ఘోరంగా కలుషితమైంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు లేవు. టీజీ వెంకటేశ్ కు ఆల్రెడీ ఒక ఇండ్రస్టీ ఉంది. మళ్లీ అదే ప్రాంతంలో రసాయనాలు వెదజల్లే పరిశ్రమ నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం. ప్రభుత్వాలను నమ్మితే ప్రయోజనం ఉండదు. ప్రజల్లో చైతన్యం రావాలి. మన రాష్ట్రంలో పొల్యూషన్ బోర్డు చాలా నిస్సారమైంది. ప్రజల గురించి ఆలోచన ఉండదు. కేవలం పరిశ్రమల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మూసీ నదీ కలుషితాన్ని అడ్డుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నాం. హైదరాబాద్ సిటీకి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ప్రాణాధారమైన కృష్ణా నదిని కలుషితం చేస్తే ప్రజలే తిరబడ్డరు.
కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కాలుష్యం చేస్తే సహించేది లేదు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి అవతలి వైపు జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటున్నాం. ఇప్పటికే పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద కుడి కాల్వ నుంచి కేటాయింపులకు మించి నీటిని తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు ఏకంగా కృష్ణా జలాలను కలుషితం చేసే ప్రాజెక్టులు, రసాయనిక పరిశ్రమలు స్థాపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కేంద్రం అలాంటి పరిశ్రమలకి అనుమతులు ఇవ్వొద్దు. హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లాలో 7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కృష్ణా నీటిని కలుషితం చేసే పరిశ్రమలకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని చూస్తే పెద్ద ఎత్తున్న ఆందోళన మొదలు అవుతాయి. తెలుగుప్రభలో వచ్చిన కథనంపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి, స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.


