FSSAI Tea Clarification: మనం రోజూ తాగే టీ విషయంలో ఫుడ్ సేఫ్టీ సంస్థ FSSAI కీలక ప్రకటన విడుదల చేసింది. మార్కెట్లో అమ్ముతున్న ప్రతి పానీయాన్ని ‘టీ’ అని పిలవడానికి వీల్లేదని, దీనిపై తయారీదారులకు, సెల్లర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్యాకేజింగ్‌పై “టీ” అనే పదాన్ని వాడటంపై స్పష్టమైన నిబంధనలను విధిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
అసలైన ‘టీ’ అంటే ఏమిటి?
FSSAI నిబంధనల ప్రకారం.. కేవలం ‘కామెల్లియా సినెన్సిస్’ అనే మొక్క నుంచి సేకరించిన ఆకులతో తయారైన పానీయాన్ని మాత్రమే చట్టబద్ధంగా ‘టీ’ అని పిలవాలి. ఈ జాబితాలోకి కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్‌స్టంట్ టీలు వస్తాయి. ఈ మొక్క నుంచి కాకుండా ఇతర మూలికలు లేదా మొక్కల నుంచి తయారయ్యే వాటికి ‘టీ’ అనే పేరు వాడటం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని హెర్బల్ టీ పేరుతో అమ్ముతున్న అనేక ఉత్పత్తులపై స్పష్టత ఇచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో రోయిబోస్ టీ, హెర్బల్ టీ, ఫ్లవర్ టీ వంటి పేర్లతో అనేక ఉత్పత్తులు అమ్ముడవుతున్నారు. ఇవి నిజానికి టీ మొక్క నుంచి తయారైనవి కావు. ఇటువంటి ఉత్పత్తులను టీ అని పిలవడం చట్టప్రకారం ‘మిస్ బ్రాండింగ్’ కిందకు వస్తుందని FSSAI హెచ్చరించింది. ఇవి టీ కేటగిరీలో కాకుండా వాటిలోని పదార్ధాలను బట్టి ‘ప్రొప్రైటరీ ఫుడ్స్’ కిందకు వస్తాయని పేర్కొంది.
టీ ప్యాకెట్ ముందు భాగంలో ఆ ఉత్పత్తి అసలు స్వభావాన్ని స్పష్టంగా తెలియజేయాలని FSSAI ఆదేశించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు అందరూ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. రాష్ట్రాల్లోని ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని, ఉల్లంఘించిన వారిపై ‘ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006’ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది ఫుడ్ సేఫ్టీ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ.

