గంధంగూడ ప్రభుత్వ భూమిపై మళ్లీ కన్ను..
ఫెన్సింగ్ తొలగించి 300 గజాలకు ప్రీకాస్ట్ గోడ ఏర్పాటు….
సర్వే నం.43లో కోట్ల విలువైన భూమి…
రెవెన్యూ అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు…
గండిపేట్, తెలుగు ప్రభ: ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన రక్షణ కంచెనే తొలగిస్తే.. ఇక ఆ భూమికి రక్షణ ఎవరు, గంధంగూడలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామ పరిధిలోని సర్వే నెం 43లో ఉన్న ప్రభుత్వ భూమిపై మరోసారి ఆక్రమణ యత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో కొంతభాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్న స్థానికులు.. మిగిలిన భూమిని కాపాడేందుకు హైడ్రా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను కొందరు వ్యక్తులు తొలగించి, సుమారు 300 గజాల స్థలాన్ని చుట్టూ ప్రీకాస్ట్ గోడ నిర్మించినట్లు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
22 ఎకరాల 16 గుంటలు.. ఆక్రమణల నీడలో…
గంధంగూడ సర్వే నం.43లో సుమారు 22 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విలువైన ఈ భూమిలో కొంతభాగం గతంలోనే ఆక్రమణలకు గురైందని, పలువురి చేతులు మారినట్లు స్థానికంగా ప్రచారం ఉందని పేర్కొంటున్నారు. మిగిలిన ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు హైడ్రా అధికారులు కొన్ని నెలల క్రితం ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించామని అంటున్నారు. అయితే తాజాగా ఆ ఫెన్సింగ్‌లో కొంత భాగాన్ని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఫెన్సింగ్ మాయం.. ప్రీకాస్ట్ గోడ ప్రత్యక్షం…
ప్రభుత్వ భూమికి రక్షణగా ఉన్న ఫెన్సింగ్ తొలగించిన ప్రాంతంలో సుమారు 300 గజాల స్థలానికి ప్రీకాస్ట్ గోడ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంటే.. మరోవైపు అదే రక్షణను తొలగించి నిర్మాణం చేపట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఎవరి అనుమతి ఉంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి ఏ శాఖ అనుమతిచ్చింది. లేక ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేపట్టారా, అన్నది అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గజం రూ.60, 70 వేలైతే.. కన్ను ప్రభుత్వ భూమిపైనేనా…?
గంధంగూడ పరిసర ప్రాంతాల్లో భూమి ధరలు గజానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ భూమి విలువ భారీగా ఉంటుందని, అందుకే విలువైన ప్రభుత్వ స్థలాలపై ఆక్రమణదారుల కన్ను పడుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.
ప్రధాన రహదారి పక్కనే దందా.. అధికారులకు కనిపించదా…?
సాయిబాలాజీనగర్, తిరుమల హిల్స్ ప్రధాన మార్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలోనే ఈ నిర్మాణం జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. బహిరంగంగా ఫెన్సింగ్ తొలగించి ప్రీకాస్ట్ గోడ నిర్మాణం చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరుగుతుంటే రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా యంత్రాంగాల పర్యవేక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
తహసీల్దార్ నోటీసులున్నా.. ఆగని పనులు…?
ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ గతంలో తహసీల్దార్ నోటీసులు జారీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టే పరిస్థితి ఉంటే.. నిబంధనలను అమలు చేయాల్సిన యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు.
హైడ్రా వేసిన కంచె తొలగిస్తే.. ప్రభుత్వ భూమికి రక్షణ ఏది…?
ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు హైడ్రా స్వయంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌నే తొలగించినట్లు ఆరోపణలు రావడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఫెన్సింగ్ తొలగింపును అధికారులు గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలని స్థానికులు కోరుతున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్…
సర్వే నం.43లోని ప్రభుత్వ భూమిని అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి సరిహద్దులను పునఃనిర్ధారించి, హైడ్రా ఫెన్సింగ్ తొలగింపు, ప్రీకాస్ట్ గోడ నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని తేలితే వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనంలోకి తీసుకోవాలని అంటున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తి పరిరక్షణలో ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, హైడ్రా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమికి పటిష్ఠమైన రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

