Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును మార్చాలంటూ ప్రముఖ ప్రవచన కర్త, పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు సంచలన డిమాండ్ చేశారు. మన రాష్ట్ర పేరు తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం ప్రారంభమైన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు స్ఫూర్తిగా తీసుకోవాలి: పేరు మార్పు డిమాండ్ వెనుక ఉన్న ప్రాధాన్యతను గరికిపాటి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా తెలుగు పదం కాదని తెలిపారు. మన రాష్ట్రానికి మన భాషకు అద్దం పట్టేలా పేరు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు తరహాలోనే.. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా “తెలుగు నాడు” అని పేరు పెట్టాలని సూచించారు.
ఆత్మగౌరవ ప్రతీక: ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదని గరికిపాటి నరసింహారావు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చుకున్న విషయాన్ని గరికిపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also read-Tirumala:శ్రీవారి భక్తులకు గమనిక.. వాటిని రద్దు చేసిన టీటీడీ
వేదికపై ప్రముఖుల సందడి: మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు గరికిపాటితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, ఏపీ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. అయితే గరికిపాటి చేసిన పేరు మార్పు ప్రతిపాదన ఇప్పుడు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

