Gold price: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 150 డాలర్లు తగ్గి 4,110 డాలర్లకు చేరడంతో.. దాని ప్రభావం స్థానిక మార్కెట్లపై తీవ్రంగా పడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయానికి 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం ధర రూ.1,56,900 ఉంది. అయితే ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన భారీ కుదుపుతో అమాంతం రూ.6,000 తగ్గి.. రూ.1,50,400కు పడిపోయింది. వెండి ధర సైతం రూ.9,480 తగ్గింది. రూ.2,51,480 ఉన్న కిలో వెండి ధర.. రూ.2,42,000కు దిగివచ్చింది
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు: వ్యాపార వర్గాల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 11 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గత మార్చిలో ఔన్సు బంగారం ధర 5,400 డాలర్లుగా ఉండగా.. ఇప్పటివరకు ఏకంగా 1,400 డాలర్లు క్షీణించింది. డాలర్ విలువ పెరగడంతో ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం కావడంతో డిమాండ్ తగ్గింది. దీంతో ధర పడిపోతూ వస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ పెరగడంతో.. ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులను తగ్గించారు.
దేశీయ మార్కెట్‌పై ప్రభావం: బంగారం, వెండి అవసరాల కోసం మనదేశం పూర్తిగా అంతర్జాతీయ సరఫరాలపైనే ఆధారపడి ఉంది. విదేశీ మారకపు ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ లోహాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుండి 15 శాతానికి పెంచింది. అలాగే వీటి కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని స్వయంగా ప్రజలకు సూచించారు. దానికి తోడు డాలర్‌తో పోల్చుతే రూపాయి విలువ పడిపోతు వస్తుంది. దీంతో బంగారం కొనుగోలు భారం కావడంతో కొంతమేర డిమాండ్ తగ్గింది.

