10th class Exams: ఇటీవల పదో తరగతి (SSC) పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పరీక్షా పత్రాల్లో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాలు, సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల దృష్ట్యా విద్యార్థులకు మొత్తం 7 మార్కులను అదనంగా కలపాలని ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు జవాబు పత్రాల మూల్యాంకనంలో (Valuation) అనుసరించాల్సిన మార్గదర్శకాలను బోర్డు అధికారులు ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు (DEOs) పంపారు.
ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు?: బోర్డు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం రెండు సబ్జెక్టులలో ఈ మార్పులు చేశారు. ఇంగ్లీష్‌లో ప్రశ్నపత్రంలో తలెత్తిన లోపాల కారణంగా ఏకంగా 5 మార్కులు కలపనున్నారు. హిందీలో సైతం సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల వల్ల మరో 2 మార్కులు జత చేయనున్నారు.
అటెంప్ట్ చేసిన వారికే మార్కులు: అయితే ఈ అదనపు మార్కులు అందరికీ వర్తించవు. ప్రశ్నలు స్పష్టంగా లేని చోట.. వాటిని ప్రయత్నించిన విద్యార్థులకు మాత్రమే ఈ 7 మార్కులు లభించనున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా మెరుగైన గ్రేడింగ్ సాధించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read-Singareni: సింగరేణి కార్మికులకు తీపి కబురు.. సహజ మరణానికి రూ.10లక్షల ఉచిత బీమా
మిగిలిన 3 ప్రశ్నలపై తల్లిదండ్రుల అభ్యంతరం: మరో మూడు ప్రశ్నల్లో కూడా తప్పులు ఉన్నాయని ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటికి కూడా మార్కులు కలపాలని కోరుతున్నారు. అయితే బోర్డు దానిని తోసిపుచ్చింది. ఆ మూడు ప్రశ్నల్లో ఎలాంటి పొరపాట్లు లేవని నిపుణులు స్పష్టం చేశారు. విద్యార్థుల సామర్థ్యాన్ని మరియు సబ్జెక్టుపై వారికున్న పట్టును పరీక్షించేందుకే ప్రశ్నలను విభిన్న కోణాల్లో అడిగామని పేర్కొంది. అది పరీక్షా విధానంలో భాగమేనని అధికారులు వివరణ ఇచ్చారు.

