Chicken price: గత కొద్దిరోజులుగా ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. సాధారణంగా ఎండాకాలంలో కోళ్లకు వ్యాధులు రావడం, ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు చికెన్ వినియోగాన్ని తగ్గించడం వంటి కారణాలతో ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈ ఏడాది మే నెల మొదటివారంలో అందుకు భిన్నంగా చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.300 నుంచి రూ.350 వరకు పలికింది. అయితే తాజాగా ఈ రోజు ధరలు భారీగా తగ్గడంతో చికెన్ ప్రియులకు పెద్ద ఊరట లభించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరల వివరాలు:
- హైదరాబాద్: రూ. 250 – రూ. 260
- గుంటూరు: రూ. 260
- రాజమండ్రి: రూ. 250
- ఖమ్మం: రూ. 280
- విజయవాడ: రూ. 310
చికెన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్న జనం: మొన్నటి వరకు చికెన్ ధరలు చుక్కలు చూపించడంతో మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలు, ఇతర నాన్‌వెజ్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు మళ్లీ ధరలు గణనీయంగా అందుబాటులోకి రావడంతో ఆదివారం నాడు చికెన్ సెంటర్ల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.
స్థిరంగానే మటన్ ధరలు: చికెన్ ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నప్పటికీ.. మటన్ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ మటన్ ధర నాణ్యతను బట్టి రూ.800 నుండి రూ.950 వరకు పలుకుతోంది. ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి చూస్తే కేజీ మటన్ రూ.700 నుండి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో మార్కెట్లలో మళ్లీ సందడి నెలకొంది.

