POCSO Case: మానవత్వం మంటగలుస్తున్నది. వావివరసలు మరచిన ఓ ప్రబుద్ధుడు.. కూతురు వరుసైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్లాక్‌మెయిలింగ్‌తో లైంగిక దాడి: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి, తన భార్య అక్క కూతురిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో ఉండే ఆ బాలిక.. ఇటీవల వేసవి సెలవుల నిమిత్తం తిరుపతిలోని చిన్నమ్మ ఇంటికి వచ్చింది. చిన్నమ్మ భర్త వరుసకు బాబాయ్ కావడంతో.. ఆ బాలిక చనువుగా మెలిగింది. దీన్ని అదనుగా తీసుకున్న నిందితుడు బాలికతో సన్నిహితంగా ఫోటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత సదరు నిందితుడు బుద్ధి మార్చుకుని.. ఆ ఫోటోలను మరియు చాటింగ్‌ను బాలికకు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ ఫోటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. అంతేకాకుండా తల్లిదండ్రులను చంపేస్తానని భయపెడుతూ.. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Also read-Dowry Case: నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తేవాల్సిందే!
సహకరించిన ప్రబుద్ధుడి భార్య: సెలవులు ముగిసిన తర్వాత బాలిక తిరిగి హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకుంది. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వారు వెంటనే హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం తిరుపతి కావడంతో.. జగద్గిరిగుట్ట పోలీసులు ఈ కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసును స్వీకరించిన తిరుపతి పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణంలో భర్త అఘాయిత్యాలు తెలిసి కూడా అతనికి సహకరించిన భార్యను సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

