తెలంగాణ, (తెలుగు ప్రభ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుంది.
ప్రతి రోజు 10 జిల్లాల్లో శిక్షణ: ఈ శిక్షణా కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి రోజు 10 జిల్లాల చొప్పున మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయనుంది. జిల్లాల్లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయి. క్షేత్రస్థాయిలో పాలనను మరింత బలోపేతం చేసేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది విధుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రధానంగా చర్చించనున్న అంశాలు ఇవే: ఈ మూడు రోజుల శిక్షణలో భాగంగా 16వ ఆర్థిక సంఘం నిధులు, వీబీజీ రాంజీ (VBGI) నిధులను గ్రామాల అభివృద్ధికి ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడంపై ప్రత్యేక కార్యాచరణపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు.

