Police open fire: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైళ్లలో దోపిడీల నియంత్రణకు గస్తీ నిర్వహిస్తున్న జీఆర్పీ (GRP) పోలీసులపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు.
అసలేం జరిగిందంటే?: రైల్వే ట్రాక్‌ల వెంబడి భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు.. ఆలూరు రైల్వే గేట్ సమీపంలో ఇనుప కట్టర్లు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు కనిపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు: పరిస్థితి విషమించడంతో అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసుల ప్రతిఘటనతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే పొన్నూరు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠానే ఈ దాడికి పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

