Parents Guidelines: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఈరోజు బోర్డు విడుదల చేయనుంది. దీంతో విద్యార్థుల్లో సహజంగానే ఒత్తిడి కనిపిస్తుంది. అయితే కేవలం మార్కులు మాత్రమే మన ప్రతిభకు ఆధారం కాదు. ఆత్మవిశ్వాసమే మన జీవితాన్ని ముందుండి నడిపిస్తోంది. అందుకే ఫలితాల విషయంలో విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విద్యావేత్తలు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. “పరీక్షలు అనేవి జీవితం కాదు.. అవి కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే” అని వారు గుర్తు చేస్తున్నారు.
ఓటమి అనేది గెలుపుకు మొదటి మెట్టు: ఫలితాలు ఎలా వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం ముఖ్యం. ఒక్క పరీక్ష మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేదు. మార్కులు తక్కువొచ్చాయని అస్సలు కుంగిపోవద్దు. ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎందరో ప్రముఖులు అకాడమిక్ పరీక్షల్లో విఫలమైనవారే. ఒకవేళ ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా.. సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల రూపంలో మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడండి.
Also read-KTR: ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అవి కేసీఆర్ ఎన్నికలే’
తల్లిదండ్రులకు విజ్ఞప్తి: పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేవడం కంటే.. వారికి తోడుగా నిలబడాల్సిన సమయం ఇదే. పక్కింటి పిల్లలతోనో, బంధువుల పిల్లలతోనో మీ పిల్లలను పోల్చి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకండి. “ఫలితం ఏదైనా మేము నీకు ఉన్నాం” అనే నమ్మకాన్ని కల్పించండి. విఫలమైన విద్యార్థులకు ఓదార్పుతో కూడిన ప్రోత్సాహం ఎంతో అవసరం. ఓటమి అనేది గెలుపుకు మొదటి మెట్టు. ఒక్క మార్కు షీట్ మీ మేధస్సును లేదా మీ సామర్థ్యాన్ని తక్కువ చేయలేదు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఫలితాలను ఒక అనుభవంగా స్వీకరించి.. ముందడుగు వేయడమే అసలైన విజయం.

