Gujarat vs Delhi: ఐపీఎల్-19లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. గెలుపు ముంగిట దిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడగా.. గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది.
మెరిసిన గిల్, బట్లర్, సుందర్: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆరంభంలో సాయి సుదర్శన్ (12) వికెట్ కోల్పోయినా.. జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరును అందించారు.
రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం: భారీ లక్ష్య ఛేదనలో దిల్లీకి ఓపెనర్లు నిశాంక (41), కేఎల్ రాహుల్ బలమైన పునాది వేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 దాటడంతో దిల్లీ విజయం ఖాయమనిపించింది. అయితే, రషీద్ ఖాన్ (3/17) తన స్పిన్ మాయాజాలంతో నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్‌లను వరుసగా ఔట్ చేసి దిల్లీని దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92 ) ఒంటరి పోరాటం చేశాడు.
చివరి బంతికి చేజారిన దిల్లీ విజయం: గాయం కారణంగా మధ్యలో వెనుదిరిగిన డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్).. తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి 19వ ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించడంతో సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులుగా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో మొదటి 4 బంతుల్లో 13 పరుగులు వచ్చాయి. చివరి 2 బంతుల్లో 2 పరుగులు వస్తే దిల్లీదే విజయం. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ నిరాకరించాడు. ఇక ఆకరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో బై కోసం ప్రయత్నించగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో కుల్‌దీప్ రనౌట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌కు ఇది తొలి విజయం కాగా.. దిల్లీకి ఇది మొదటి ఓటమి.

